ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

రాక్ గార్డెన్‌లో జయశంకర్ విగ్రహం పెడ్తం
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు :  వనపర్తి రాక్ గార్డెన్‌లో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదబాద్‌లోని అత్తాపూర్‌‌లో తయారు చేస్తున్న జయశంకర్ విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాజాపేట శివారులో  రాక్ గార్డెన్, రాజనగరం అమ్మ చెరువు, తాళ్లచెరువు, నల్లచెరువు,  ఈదుల చెరువు, లక్ష్మి కుంటల వద్ద పార్కులను అభివృద్ధి చే‌స్తున్నామని చెప్పారు. పార్కుల సుందరీకరణ, చెరువుల విస్తరణ, ఎకో పార్క్  ఏర్పాటుతో జిల్లా కేంద్రాన్ని అందంతా తీర్చిదిద్దుతున్నామన్నారు. 

కంటి వెలుగు ను సక్సెస్​ చేయాలి

ప్రభుత్వం ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్న  కంటివెలుగు కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం వనపర్తి కలెక్టరేట్‌లో కలెక్టర్ షేక్ యాస్మిన్‌ భాషా తో కలిసి  మంత్రి హరీశ్ రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఒక్కరికీ  పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్స అందిచాలని  అధికారులకు సూచించారు.

పీఏసీఎస్‌లను బలోపేతం చేయాలి :  కలెక్టర్ కోయ శ్రీహర్ష 

నారాయణపేట, వెలుగు:  నారాయణపేట జిల్లాలోని  పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీసీసీబీ చైర్మన్ నిజాం పాషాతో కలిసి జిల్లాలోని పీఏసీఎస్‌ చైర్మన్లు, అధికారులతో సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు  మాత్రమే కాకుండా వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాలు, పెట్రోల్ బంక్, సూపర్ మార్కెట్లు నిర్వహించాలని సూచించారు.  నిర్దిష్టమైన ప్రణాళికతో తమ వద్దకు వస్తే నాబార్డ్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.  జిల్లాలోని చాలా సహకార సంఘాల సొసైటీలు నష్టాల్లో ఉన్నాయని, బ్యాంకులకు రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో మొండి బకాయిలు పెరిగిపోయాయన్నారు. వీటిని తగ్గించుకుంటే  బ్యాంకులు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయన్నారు. గోదాముల నిర్మించుకునేందుకు నాబార్డ్ రుణాలు ఇస్తోందని,  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే స్థలం కేటాయించిన చోట నిర్మాణాలు చేపట్టాలని, మిగతా చోట్ల భూములు అందుబాటులో ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు.  ఈ సమావేశంలో జిల్లా కోఆపరిటివ్ అధికారి కోదండరామ్, డీఏవో జాన్ సుధాకర్ పాల్గొన్నారు.

గాంధీభవన్ ముందు సీనియర్ల నిరసన

వనపర్తి, వెలుగు :  వనపర్తిలో కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు. మాజీ మంత్రి , టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి,  ఆ పార్టీ లోని సీనియర్ల మధ్య చోటుచేసుకున్న విభేదాలు హైదరాబాద్‌కు చేరాయి.  పార్టీ నుంచి సస్పెండ్ అయిన మాజీ పీసీసీ డెలిగేట్ శంకర్ ప్రసాద్, మాజీ పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సతీశ్ యాదవ్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, నేతలు ధనలక్ష్మి, సోలుపూర్ రవీందర్ రెడ్డి,  నరోత్తం రెడ్డి,  నందిమళ్ల చంద్రమౌళి, కొండన్న, శ్రీహరిరాజు, మర్రికుంట సురేశ్, రాములు, మురళి గౌడ్,  రంగస్వామి, రమేశ్ నాయక్, కురుమూర్తి, నాగరాజ్ మంగళవారం గాంధీ భవన్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి చిన్నారెడ్డికే  గత 45 ఏండ్లుగా పార్టీ టికెట్‌ ఇస్తున్నారని, ఆయన దీన్ని ఆసగా చేసుకొని గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు.   సీనియర్లతో అవసరం లేదని పక్కన పెట్టి మీటింగులు నిర్వహించిన ఆయనే క్రమశిక్షణ తప్పారని విమర్శించారు. వనపర్తిలో కాంగ్రెస్ బతకాలంటే చిన్నారిని పోటీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ సారి అసెంబ్లీ టికెట్ ఆయనకు ఇస్తే  గాంధీ భవన్ ముందే టెంట్ వేసుకుని కూర్చుంటామని హెచ్చరించారు.

ఆర్టీసీని బలోపేతం చేస్తాం : ఎక్సైజ్​ శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​

మహబూబ్​నగర్​, వెలుగు : ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఎక్సైజ్​ శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ చెప్పారు. మహబూబ్​నగర్​ ఆర్టీసీ బస్సు డిపోకు కొత్తగా కేటాయించిన రెండు లగ్జరీ బస్సులను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇతర ఉద్యోగుల లాగా ఆర్టీసీ ఉద్యోగులను కూడా భరోసా కల్పించే విషయంపై సీఎం కేసీఆర్​ఆలోచిస్తున్నారన్నారు.  నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని  అధునాతన సౌకర్యాలతో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసకుంటున్నామన్నారు. ఉమ్మడి ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటిని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ  కార్యక్రమంలో మున్సిపల్​ చైర్మన్​ కేసీ నర్సింహులు, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రీజనల్ మేనేజర్ శ్రీదేవి, ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత పాల్గొన్నారు.

మేకల కాపరుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

అమ్రాబాద్, వెలుగు :  మేకల కాపరుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఎస్సై కృష్ణ దేవ వివరాల ప్రకారం.. శ్రీశైలం మండలం లింగాల గట్టుకు చెందిన శ్రీను వద్ద అదే గ్రామానికి చెందిన నల్లబోతుల వెంకటేశ్వర్లు,   అచ్చంపేట మండలం అక్కారానికి చెందిన ఉల్లంగుండ వెంకటయ్య (29)మేకల కాపరులుగా పనిచేస్తున్నారు. ఇద్దరు కృష్ణానది సమీపంలోని వజ్రాల మడుగు వద్ద మేకల గుంపుని పెట్టుకుని అడవిలోనే ఉంటున్నారు.  నాలుగు రోజుల కింద ఇద్దరి మధ్య  ఘర్షణ జరిగింది. దీంతో వెంకటేశ్వర్లు వెంకటయ్యను కట్టెతో  బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు.  చనిపోయాడనుకొని కృష్ణా నదిలో పడేశాడు. సోమవారం మేకల ఓనర్  సద్ది ఇచ్చేందుకు వెళ్లగా వెంకటేశ్వర్లు జరిగిన విషయం చెప్పాడు.  వెంటనే ఆయన  పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం డెడ్‌బాడీ దొరకవడంతో  పోస్టు మార్టం కోసం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. అనంతరం డెడ్‌బాడీని కుంటుంబసభ్యులకు  అప్పగించి.. వారి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేశారు.

ఇండ్ల కేటాయింపులో అవకతవకలు : డీసీసీ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్ (భూత్పూర్),  వెలుగు : భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌ రూమ్‌ ఇండ్ల  కేటాయింపులో అవకతవకలు జరిగాయని డీసీసీ ప్రెసిడెంట్‌ జి.మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.   మంగళవారం లబ్ధిదారులతో కలిసి భూత్పూర్ నుంచి  కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు.  మధ్యాహ్నం 1 గంటలకు కలెక్టరేట్ రాగా.. పోలీసులు కొందరు నాయకులనే మాత్రమే కలెక్టరేట్ ఆఫీసులోకి పంపించారు.  ఈ సందర్భంగా వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అడిషనల్ కలెక్టర్ సీతారామారావుకు అందజేశారు.  అనంతరం మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ  అధికార పార్టీ నాయకులకు డబ్బులు ఇస్తేనే డబుల్ బెడ్ రూమ్‌ ఇండ్లు ఇస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు భూత్పూర్ మండలంలోని ప్రతి తండాకు రోడ్లు వేయించాలని, కర్వెన ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.  కొత్తకోటలో 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్, అభిలాష్ రావు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, భూత్పూర్ మండల అధ్యక్షుడు వెంకట నరసింహరెడ్డి, నాయకులు నవీన్, మదిగట్ల శ్రీనివాన్రెడ్డి, కొండా జగదీశ్వర్, సీజే బెనహర్, లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ బాద్రి, సాయిబాబా, రాములుయాదవ్, అబ్దుల్ హక్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

స్కూళ్లలో టీఎల్‌ఎం మేళా

మరికల్​, వెలుగు :  ఉమ్మడి జిల్లాలో పలు స్కూళ్లలో మంగళవారం ‘టీచింగ్ లెర్నింగ్ మెటీరిల్’ మేళాను నిర్వహించారు.  మరికల్ మండల కేంద్రంలోని బాలుర హైస్కూల్‌లో జడ్పీ వైస్​ చైర్‌‌​పర్సన్​ సురేఖరెడ్డి, ఉప్పునుంతల జడ్పీహెచ్‌ఎస్‌, అమ్రాబాద్ ప్రైమరీ స్కూళ్లలో డీఈవో గోవిందరాజులు, మద్దూరు జడ్పీహెచ్‌లో జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, ఎంఈవో గోపాల్ నాయక్ మేళాను ప్రారంభించారు.  విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు సంబంధించి సామగ్రిని ప్రదర్శించగా.. టీచర్లు, ప్రజాప్రతినిధులు, స్టూడెంట్లు తిలకించారు. 

బ్యాంకర్లు లక్ష్యం మేరకు రుణాలివ్వాలి : కలెక్టర్ ఉదయ్ కుమార్ 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు :  2023–24 ఏడాదికి సబంధించి లక్ష్యం మేరకు పంట రుణాలివ్వాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు బ్యాంకర్లను ఆదేశించారు.  మంగళవారం డీసీసీబీ బ్యాంకు మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమావేశానికి చీఫ్‌ గెస్టుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ క్రాప్, లాంగ్‌ టర్మ్‌, ఇతర లోన్లకు సంబంధించిన టార్గెట్‌ను ఇప్పటికే ఇచ్చామన్నారు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ మిల్లెట్స్ గా గుర్తించినందున మిల్లెట్స్ పండిస్తున్న ప్రతి రైతుకు తప్పనిసరిగా రుణం ఇవ్వాలన్నారు. జిల్లాలో పామాయిల్‌తో పాటు, ఉద్యాన పంటలను విరివిగా పండించే అవకాశం ఉందని, హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.   మండల మహిళా సమాఖ్య భవనాల్లో 5 నుంచి 7 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్బీఐ మాదిరిగానే ఇతర బ్యాంకులు మహిళల ఉపాధికి కృషి చేయాలన్నారు.  డీసీసీబీ చైర్మన్  నిజాం పాషా మాట్లాడుతూ జిల్లాలో అన్ని బ్యాంకులు  రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయవద్దన్నారు.  అనంతరం  నాబార్డ్ ఆధ్వర్యంలో 2023–-24 ఏడాదికి సంబంధించిన  జిల్లా  వనరుల ఆధారిత రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో ఎల్డీఎం కే భాస్కర్, డీసీసీబీ బ్యాంకు సీఈవో టి.లక్ష్మయ్య, ఎస్బీఐ ఏజీఎం  శ్రవణ్ కుమార్ రెడ్డి, నాబార్డ్ డీడీఎం వీవీఎస్ శ్రీనివాస్, షణ్ముఖ చారి, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్, , హార్టికల్చర్ ఆఫీసర్ సాయిబాబా, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇందిర, వెటర్నరీ  ఆఫీసర్  మధుసూదన్ గౌడ్, పీఏసీఎస్‌ చైర్మన్లు పాల్గొన్నారు.

అస్తిత్వం కోల్పోవడంతోనే బీఆర్‌‌ఎస్‌ పెట్టిండు : బీజేపీ సీనియర్ నేత నామాజీ

నారాయణపేట, వెలుగు : రాష్ట్రంలో అస్తిత్వం కోల్పోవడంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత నాగురావు నామాజీ విమర్శించారు.  మంగళవారం తన నివాసంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులుతో కలిసి మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లైనా ఒక్క హామీ నెరవేర్చని  కేసీఆర్ దేశాన్ని ఏం ఉద్దరిస్తారని నిలదీశారు.  జిల్లాలో భగీరథ పథకం అస్తవ్యస్తంగా ఉందని, నీళ్లు రాక 15 రోజులైనా పట్టించుకునే దిక్కులేదన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ తన పతనం ఖాయమని తెలుసుకుని బీఆర్ఎస్‌కు తెరలేపారని ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా నారాయణపేట జిల్లాకు ఎలాంటి ప్రయోజనం లేదని,  69 జీవోతోనే మేలు జరుగుతుందన్నారు.  జిల్లా కేంద్రంలో ఉన్న పూలే గురుకుల పాఠశాలను మరికల్ కు తరలించే ప్రయత్నాలు జరుగుగున్నట్లు తెలిసిందని, ఇదే జరిగితే  ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిప్రభాకర్ వర్ధన్, ఉపాధ్యాక్షుడు కె.సత్యయాదవ్, కోశాధికారి సిద్ది వెంకట్రాములు, నియోజకవర్గ కన్వీనర్  నర్సింలు,   నగర అధ్యక్షుడు రఘు రామయ్య పాల్గొన్నారు. 

ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయండి : కలెక్టర్ ఉదయ్ కుమార్ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  జిల్లాలో పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో లబ్ధిదారుల ఎంపిక పంపిణీ పై  సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలోని  పట్టణ ప్రాంతాల్లో 582, గ్రామీణ ప్రాంతాల్లో 199 ఇండ్లు పూర్తయ్యాయని, విద్యుత్‌, మిషన్ భగీరథ లాంటి వసతులు కల్పించాలని ఆదేశించారు.  నాగర్ కర్నూల్ పట్టణంలో 192, అచ్చంపేటలో 150, కల్వకుర్తి 240 ,  పెద్ద ముద్దునూరులో 30, గన్యాకుల 25, వనపట్ల 20, ఇంద్రకల్ 20, తాడూర్‌‌లో 104 ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు.