- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
దేవరకొండ (డిండి), వెలుగు : స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో యువత కృషి చేసి తాము అనుకున్నది సాధించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. నల్గొండ జిల్లా డిండి మండలంలోని వ్యవసాయ విత్తనోత్పత్తి కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. స్వాతంత్య్ర సాధన కోసం బలిదానం చేసిన మహనీయుల గురించి ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. డిండిలోని వ్యవసాయ విత్తనోత్పత్తి కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు చిరుధాన్యాల మొలకలతో ఏర్పాటు చేసిన 75 సంఖ్యతో పాటు, సీఎం కేసీఆర్ ఫొటోను చూసి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, అడిషనల్ కలెక్టర్ రాహుల్‌శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మ, ఎంపీపీ మాధవరం సునితా జనార్దన్‌రావు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ ఎగ్జామ్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
కోదాడ, వెలుగు : ఈ నెల 28న జరగనున్న పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు. సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో మంగళవారం కోదాడలోని కేఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పోలీసు రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్ రీజినల్ కో ఆర్డినేటర్, కాలేజీ ప్రిన్సిపాల్ నాగు పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. కోదాడ, సూర్యాపేట డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, నాగభూషణం, లెక్చరర్ నోముల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కౌన్సిలర్ ఫ్యామిలీకి పరామర్శ
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ మున్సిపల్ కౌన్సిలర్ తుమ్మలపల్లి సత్తమ్మ సోమవారం గుండెపోటుతో చనిపోయారు. విషయం తెలుసుకున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి, సీఎల్పీ మాజీ లీడర్ కుందూరు జానారెడ్డి మంగళవారం సత్తమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాళి అర్పించిన వారిలో పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, అప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవెల్లి విజేందర్‌రెడ్డి, వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, గుంటుక వెంకట్‌రెడ్డి ఉన్నారు.
తప్పిపోయిన చిన్నారులు.. పేరెంట్స్‌కు అప్పగించిన పోలీసులు
సూర్యాపేట, వెలుగు : తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను మంగళవారం సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు వారి పేరెంట్స్‌కు అప్పగించారు. సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై చలికంటి నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం... జాజిరెడ్డిగూడెం మండలానికి చెందిన తేజ నాయక్ (9) సూర్యాపేటలోని గాంధీనగర్ సమీపంలో గల లైలా స్కూల్‌లో చదువుతున్నాడు. మంగళవారం స్కూల్ నుంచి బయటకు వచ్చి ఖమ్మం ఫ్లైఓవర్ సమీపంలో తిరుగుతున్నాడు. గమనించిన ట్రాఫిక్ పోలీసులు అతడి వివరాలను ఆరా తీసి, తండ్రికి ఫోన్ చేసి పిలిపించి తేజను అప్పగించారు. అలాగే సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో 8 ఏళ్ల బాబును గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకొని వివరాలు తెలుసుకున్నారు. చిన్నారిని విద్యానగర్‌కు చెందిన హర్షవర్దన్‌రెడ్డిగా తెలుసుకొని అతడి పేరెంట్స్ శ్రీకాంత్‌రెడ్డి, భవానీకి ఫోన్ చేసి పిలిపించారు. అనంతరం బాబును వారికి అప్పగించారు.
పథకాల అమలులో తెలంగాణ ఫస్ట్
దేవరకొండ, వెలుగు : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన పలువురిక మంజూరైన ఆసరా పెన్షన్లను మంగళవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వంపై భారం పడుతున్నా పట్టించుకోకుండా కొత్త పెన్షన్లను మంజూరు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేశ్‌గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నేనావత్ శ్రీను, ఎంపీడీవో శర్మ, మండల అధ్యక్షుడు టీవీఎన్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్దే ధ్యేయం
నకిరేకల్, వెలుగు : నకిరేకల్ మున్సిపాలిటీకి చెందిన పలువురికి మంజూరైన ఆసరా పెన్షన్లను మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, వైస్‌చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ బాలాజీ పాల్గొన్నారు.
బీజేపీని అడ్డుకుంటాం
యాదాద్రి, వెలుగు : బీజేపీని అడ్డుకోవడమే కమ్యూనిస్టుల కర్తవ్యం అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా రాయగిరిలో మంగళవారం జరిగిన సీపీఐ జిల్లా ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విమోచనం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీజేపీని దేశం నుంచి తరిమేసేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఐ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యాదాద్రి జిల్లా కార్యదర్శిగా గోద శ్రీరాములును మూడోసారి ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా యానాల దామోదర్‌రెడ్డి, బొలగాని సత్యనారాయణతో పాటు జిల్లా కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. అలాగే రావి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం ఆడిటోరియం నిర్మించడంతో పాటు, జయంతి, -వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని, నందనం నీరా సెంటర్‌కు బొమ్మగాని ధర్మ భిక్షం పేరు పెట్టాలని, పలు సమస్యలపై తీర్మానం చేశారు.
జాతీయ స్థాయి పోటీలకు రామాపురం స్టూడెంట్లు
మేళ్లచెరువు, వెలుగు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురం జడ్పీ హైస్కూల్‌కు చెందిన స్టూడెంట్లు జాతీయ స్థాయి బేస్‌బాల్, సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 13న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సెలక్షన్స్ జరుగగా సబ్ జూనియర్ విభాగంలో మధులత, శరణ్య, భానుప్రకాశ్, గణేశ్ సెలెక్ట్ అయ్యారు. వీరు మహారాష్ట్ర నాంధేడ్‌లో ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు, పీఈటీ ఉస్మాన్‌ను మంగళవారం హెచ్‌ఎం మధు, ఎస్‌ఎంసీ చైర్మన్ కుమారి, స్టాఫ్ రెహానా, హనుమంతరావు, జగ్గు, రమేశ్, సాహెబ్ అలీ, సత్యనారాయణ, బాలాజీ, మస్తాన్, బాలు అభినందించారు.
ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్ల షెడ్యూల్ ప్రకటించాలి
నకిరేకల్, వెలుగు : విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి ఈ నెల 26 నుంచి దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తామని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి యాట మధుసూదన్‌రెడ్డి, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ టి. నర్సింహమూర్తి ప్రకటించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని పలు స్కూళ్లలో మంగళవారం సభ్యత్వ నమోదును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా ట్రాన్స్‌ఫర్లు, ఏడేళ్లుగా ప్రమోషన్లు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల నియామకాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సబ్జెక్టు టీచర్ల కొరతతో స్టూడెంట్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్ల షెడ్యూల్‌ను ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 టీచర్లు అంతా నల్లబ్యాడ్జీలతో డ్యూటీకి హాజరుకావాలని, లంచ్ టైంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. మండల అధ్యక్ష, కార్యదర్శులు జి. భద్రయ్య, కె.బాలాజీ, నాయకులు పి. తిరుమలయ్య, బి.వేణుగోపాల్, ఎల్.నగేశ్, నవీన్‌రెడ్డి, జి.శంకరయ్య, ఎ.సైదమ్మ పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ లీడర్లు
చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ.యాకూబ్‌తో పాటు, మర్రిగూడ వార్డు సభ్యుడు జి.యాదయ్య, రాజంపేట వార్డు సభ్యుడు లక్ష్మణ్‌నాయక్ మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, టెస్కాబ్ వైస్‌చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆలయ పునర్నిర్మాణానికి రావాలని మంత్రికి ఆహ్వానం
తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోడూరులో ఈ నెల 24న నిర్వహించే శంభులింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి రావాలని ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం మంత్రి జగదీశ్‌రెడ్డికి హైదరాబాద్‌లో ఆహ్వానపత్రం అందజేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు సామ అభిషేక్‌రెడ్డి, దేశగాని పాపయ్యగౌడ్, వీరెల్లి వెంకట్‌రెడ్డి, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ మారోజు బ్రహ్మచారి పాల్గొన్నారు.
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి
తుంగతుర్తి, వెలుగు: వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో వీఆర్‌ఏలు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగమల్లేశ్ మాట్లాడుతూ పే స్కేల్ అమలు చేస్తామని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు, 55 ఏళ్లు నిండిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కావడం లేదన్నారు. నెల రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల జిల్లా జేఏసీ కో-కన్వీనర్ మల్లెపాక వెంకటయ్య, సీపీఎం నాయకులు కడెం లింగయ్య, డివిజన్ కో కన్వీనర్ చింతకాయల సత్తయ్య, మండల ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య, ప్రశాంత్, నాగరాజు, యాదమ్మ పాల్గొన్నారు.
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు సహకరించాలి
సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదేశించారు. పీఎంఈజీపీ పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకునేలా ఆఫీసర్లు, బ్యాంకర్లు అవగాహన కల్పించాలని సూచించారు. బ్యాంకర్లతో మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పీఎంఈజీపీ పథకంలో ప్రభుత్వం కొన్ని సడలింపులు చేసిందని, ఇందులో భాగంగా కంపెనీల ఏర్పాటు కోసం రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు లోన్ ఫెసిలిటీ కల్పిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 35 శాతం, పట్టణ ప్రాంత ప్రజలకు 25 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. 2022 – 23 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇప్పటివరకు లక్ష్యానికి మించి లోన్లు ఇవ్వడం అభినందనీయం అన్నారు. పీఎంఈజీపీ పథకం కింద సూర్యాపేట జిల్లాలో 15 యూనిట్లకు రూ. 1.35 కోట్లు శాంక్షన్ చేయగా, ఇప్పటివరకు 11 యూనిట్లకు రూ. 84 లక్షలు మంజూరు అయ్యాయని చెప్పారు. అలాగే స్టాండప్ ఇండియా పథకం కింద 28 యూనిట్లకు రూ. 3.44 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, ఆర్‌బీఐ ఏజీఎం రాజేంద్రప్రసాద్, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, నాబార్డ్ డీపీఎం సత్యనారాయణ పాల్గొన్నారు.
రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలి
మిర్యాలగూడ, వెలుగు : మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లిం, దళిత సంఘాల లీడర్లు డిమాండ్ చేశారు. మంగళవారం మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు ముస్లింలు ఎమ్మెల్యే రాజా సింగ్ దిష్టిబొమ్మతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
హుజూర్‌నగర్, వెలుగు : ముస్లింల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేయాలని ముస్లిం నాయకుడు అజీజ్‌పాషా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాజా సింగ్ పోస్ట్ చేసిన వీడియోను వెంటనే తొలగించాలని కోరారు. సమావేశంలో నవాబ్‌జానీ, అబ్దుల్ రహీం పాషా, పఠాన్ గౌస్‌ఖాన్, రసూల్, రహమతుల్లా, అక్బర్‌పాషా పాల్గొన్నారు.
పీహెచ్‌సీని తనిఖీ చేసిన సెంట్రల్ టీం
దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పీహెచ్‌సీని మంగళవారం సెంట్రల్ టీం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ రికార్డులను తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, టెలీ మెడిసిన్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీం మెంబర్స్ డాక్టర్ హర్షలత, డాక్టర్ జిషా మాట్లాడుతూ రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వారి వెంట మెడికల్ ఆఫీసర్లు ఉషారాణి, ఇమ్రాన్, దివ్య, జరియాబేగం, హవిల్ కుమార్, జాకీర్, లక్ష్మణ్ ఉన్నారు.
అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరుతున్రు
హుజూర్‌నగర్, వెలుగు : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. నియోజకవర్గంలోని మఠంపల్లి, హుజూర్‌నగర్ మండలాలకు చెందిన పలు పార్టీల లీడర్లు మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
కారు ఢీకొని తల్లీకూతురు మృతి
మిర్యాలగూడ, వెలుగు : కారు ఢీకొనడంతో తల్లీకూతుళ్లు చనిపోయారు. ఈ ప్రమాదం మంగళవారం త్రిపురారంలో జరిగింది. మిర్యాలగూడ మండలం గోగువారిగూడేనికి చెందిన మేకల రమేశ్, సైదమ్మ (34) దంపతులకు మౌనిక(16), శివ సంతానం. దంతులిద్దరూ పెద్దదేవులపల్లిలోని కోళ్లఫాంలో కూలీలుగా పనిచేస్తున్నారు. మౌనికకు సోమవారం అవంతీపురంలో కౌన్సెలింగ్ ఉండడంతో సైదమ్మతో కలిసి వెళ్లింది. కౌన్సెలింగ్ ముగిశాక మిర్యాలగూడలో తమ బంధువైన విష్ణు కలవడంతో అతడి బైక్‌పై పెద్దదేవులపల్లి వస్తున్నారు. త్రిపురారం రాగానే కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సైదమ్మ, మౌనికను హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.