గత పదేండ్ల దాడులపై మహిళా కమిషన్​కు ఫిర్యాదు చెయ్ : సీతక్క

గత పదేండ్ల దాడులపై మహిళా కమిషన్​కు ఫిర్యాదు చెయ్ : సీతక్క
  • కేటీఆర్​కు మంత్రి సీతక్క సూచన
  • ఎన్ సీఆర్ బీ డేటాను విడుదల చేసిన మంత్రి 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడులపై మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేయాలని కేటీఆర్ కు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు మహిళలపై జరిగిన  దాడుల వివరాల డేటాను మంత్రి మీడియాకు విడుదల చేశారు. ఎన్ సీ ఆర్ బీ ( నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ) కి చెందిన గత 10 ఏండ్ల డేటాను మంత్రి సీతక్క మీడియాతో పంచుకున్నారు. ఆదివారం గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్ జరిగే హోటల్ దగ్గర మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. 

బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో మహిళలపై జరిగిన దాడులు, గత 9 నెలల్లో జరిగిన దాడులపై ఫిర్యాదు చేద్దామని మంత్రి సవాల్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతి ఏటా 15 వేలకు పైగా దాడులు జరిగాయని, ఈ దాడులు ప్రతి ఏటా పెరిగాయే తప్ప తగ్గలేదని తెలిపారు. దిశ కేసు, జూబ్లీహిల్స్ పబ్ కేసు, విద్యార్థులు, మహిళలపై గ్యాంగ్ రేప్ లు ఇలా ఎన్నో జరిగాయని మంత్రి గుర్తు చేశారు. 

2014లో 14,417, 2015లో 15,425, 2016లో 15,374, 2017లో 17,521, 2018లో 16,027, 2019 లో 18,394, 2020లో 17,791, 2021లో 20,865, 2022లో 22,066 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. గత 10 ఏండ్లలో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తే అది వడ్డీలకే సరిపోయిందని, రైతులు ఎక్కడ విముక్తులయ్యారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 కల్లా 9 నెలల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే, ఓర్వ లేకనే బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇంకా రేషన్ కార్డులు లేని వారికి, టెక్నికల్ సమస్యలు ఉన్న రైతులకు నెల రోజుల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అయినా బీఆర్ఎస్ నేతలు వాటిని పట్టించుకోకుండా తమ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. 

బీఆర్ఎస్ మునిగిపోయే నావ: మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, టైమ్ వేస్ట్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కవిత బెయిల్ కోసం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానుందని, ఢిల్లీలో అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, బీజేపీలో ఉన్న తన మిత్రులు చెప్పారన్నారు. ఆదివారం సీఎల్పీ మీటింగ్ దగ్గర మంత్రి మీడియాతో మాట్లాడారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని ఒక్క సీటులో కూడా గెలిపించలేదన్నారు. కేటీఆర్, హరీశ్ రావు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థి భారీ మెజార్టీ సాధించారని, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు బీఆర్ఎస్ పనిచేసిందనటానికి ఈ ఉదాహరణలు సరిపోవా అని మంత్రి ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో తాము ప్రచారం చేయకున్నా 3 ఎంపీ సీట్లు గెలిచామని మంత్రి గుర్తు చేశారు.