- సర్పంచుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వమే కారణం: మంత్రి సీతక్క
- బిల్లులు ఎందుకు క్లియర్ చేయలేదని హరీశ్‌పై ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్హయాంలోనే సర్పంచుల బిల్లుల పెండింగ్ ఉన్నాయని, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన హరీశ్‌రావు అప్పుడు బిల్లులు ఎందుకు క్లియర్ చేయలేదని మంత్రి సీతక్క ప్రశ్నించారు. బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైంది బీఆర్ఎస్ కాదా అని మంత్రి నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచుల ఆత్మహత్యలు, పెండింగ్ బిల్లులపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను మంత్రి సోమవారం మీడియాకు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచుకు బిల్లులు ఇవ్వకపోగా.. వారితో బలవంతంగా పనులు చేయించిందన్నారు. ఏండ్ల తరబడి బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణమైందన్నారు. ఇప్పుడు సర్పంచులకు బిల్లులు చెల్లించాలని ఆందోళన చేయడం చూస్తుంటే చంపినోడే తద్దినం పెట్టినట్లు ఉందన్నారు. బీఆర్ఎస్ పెండింగ్‌లో పెట్టిన రూ.580 కోట్లకు పైగా బిల్లులను ఇప్పటికే చెల్లించామని చెప్పారు.
పనులు చేయించుకుని బిల్లులు పెండింగ్‌లో పెట్టిన మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు నివాసాల ముందు సర్పంచులు ధర్నా చేయాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అహంకారం కారణంగానే బిల్లులు పెండింగ్‌లో పడ్డాయని, బిల్లుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుందని, జరిగిన పనులపై విచారణ జరిపి బిల్లులు చెల్లిస్తామని మంత్రి తెలిపారు.
ఏ శాఖలో ఉన్నా నా మనసంతా ట్రైబల్స్ మీదే
తాను ఏ శాఖ మంత్రిగా ఉన్నా తన మనసంతా ట్రైబల్ వెల్ఫేర్ పైనే ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఆదివాసీలు, చెంచులు, గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రంలోని అన్ని ట్రైబల్ ఏరియాల్లో పర్యటిస్తూ.. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని చెప్పారు. ట్రైబల్స్‌లో అక్షరాస్యతను పెంచేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తున్నదని పేర్కొన్నారు.
సంక్షేమ హాస్టల్స్‌లోని స్టూడెంట్‌కు తమ ప్రభుత్వం16 ఏండ్ల తర్వాత కాస్మోటిక్ చార్జీలు, 8 ఏండ్ల తర్వాత డైట్ చార్జీలు పెంచిందని తెలిపారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కుమ్రం భీం ఆదివాసీ భవన్ లో ట్రైబల్ వెల్ఫేర్ పై సీతక్క సమీక్షించారు. ఐటీడీఏ పీవోలు, హెచ్ ఎంలు, ట్రైబల్ హాస్టల్స్ వార్డెన్లు, ప్రిన్సిపాల్స్, జిల్లా ట్రైబల్ అధికారులు దాదాపు 800 మంది అటెండ్ అయ్యారు. అంతకుముందు కుమ్రం భీం విగ్రహానికి నివాళి అర్పించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాల్లో విద్యార్థుల కోసం హెల్త్ మానిటరింగ్ యాప్ ను ప్రారంభించారు.
ఈ యాప్ ద్వారా గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని మంత్రికి అధికారులు తెలిపారు. ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన పలువురు విద్యార్థులకు మంత్రి ల్యాప్ టాప్ లు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లనుంచి పెండింగ్ లో ఉన్న అశ్రమ టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని, 40 శాతం డైట్ చార్జీలు పెంచామని తెలిపారు. దీని వల్ల అన్ని సంక్షేమ హాస్టల్స్ లో సుమారు ఏడున్నర లక్షల మందికి ప్రయోజనం కలుగుతున్నదని తెలిపారు. ట్రైబల్ స్టూడెంట్స్ పై వార్డెన్లు, ప్రిన్సిపాల్స్ ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
హాస్టల్స్ కు నాసిరకం వస్తువులు సరఫరా చేస్తే.. విచారణ జరిపించి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడ్తామని, అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ట్రైబల్ సెక్రటరీ శరత్, ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి, డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ స్వముజ్వలతోపాటు ఐటీడీఏ పీవోలు పాల్గొన్నారు.