ములుగు, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఆగంచేసే నల్ల చట్టాలను తీసుకువచ్చిందని, కార్పొరేట్కంపెనీలకు రెడ్ కార్పేట్ వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క విమర్శించారు. గురువారం ములుగులో ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం త్యాగం చేశారని, వారి వారసత్వంతో సోనియా, రాహుల్‌గాంధీ ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్ ను ప్రధాని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేశామని వెల్లడించారు. పార్లమెంట్ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం గోవిందరావుపేట మండలంలో వివాహ, గృహప్రవేశ కార్యక్రమాలకు మంత్రి హాజరై ఆశీర్వదించారు.
కోటగడ్డ గ్రామానికి చెందిన కమ్యూనిస్టు నాయకుడు తుమ్మల భిక్షం రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, రాష్ట్ర, జిల్లా, బ్లాక్, ములుగు మండల క్లస్టర్ ఇన్చార్జిలు, నాయకులు ఉన్నారు.