- మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తున్నది
- బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్గాపని చేస్తున్నది
- కుల గణనను కుట్రపూరితంగా అడ్డుకుంటున్నరు
- రైతులను నిండా ముంచిన చరిత్ర బీఆర్ఎస్ది అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి సీతక్క విమర్శించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ’ టీమ్‌గా పని చేస్తున్నదని దుయ్యబట్టారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. సెక్రటేరియెట్‌లో మంత్రి సీతక్క సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు బీఆర్ఎస్ ఆటంకం కలిగిస్తున్నది.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అడ్డుపడుతున్నది. కేటీఆర్ పిలుపు మేరకు కుల గణన కోసం వచ్చిన అధికారులను కొందరు నిలదీస్తున్నరు. కుల గణను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ను బీసీ సంఘాలు నిలదీయాలి. కుల గణనను అడ్డుకుంటే బీసీ ద్రోహిగా బీఆర్ఎస్ మిగిలిపోతది. విదేశాల నుంచి రప్పించి మరీ బీఆర్ఎస్ కుటుంబ సర్వే చేయించింది. దాంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. సామాజిక వర్గాల వారీగా జనాభా లెక్క తేలితేనే.. సంక్షేమ వాటా సాధ్యమవుతది’’అని సీతక్క అన్నారు. ఇంటింటి సమగ్ర సర్వేను బహిష్కరించడమంటే.. హక్కులు, అభివృద్ధిని వదులుకోవడమే అని తెలిపారు.
కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలే
తాలు, తరుగు పేరుతో రైతులను నిండా ముంచిన చరిత్ర బీఆర్ఎస్ది అని మంత్రి సీతక్క మండిపడ్డారు. తాము మిల్లర్లపట్ల కఠినంగా వ్యవహరిస్తుంటే.. బీఆర్ఎస్ ఏమో అక్రమ మిల్లర్లతో కుమ్మక్కై అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నదని ఫైర్ అయ్యారు. ‘‘ధర్నా చౌక్లు ఎత్తేసిన బీఆర్ఎస్ పెద్దలు.. ధర్నాలకు దిగడం విడ్డూరంగా ఉంది. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సీఎం, మంత్రులు సెక్రటేరియెట్‌కు రాలేదు.
ప్రజలకు అందుబాటులో లేరు. కొందరు లీడర్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? ఎంత రుణమాఫీ అయ్యిందో ప్రజలు ఆలోచించాలి. ఒక కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదు. ఆటో డ్రైవర్లను ఉసిగొల్పి ధర్నాలు చేయిస్తున్నది. ఓలా, ఉబర్ క్యాబ్, బైక్ ట్యాక్సీలు తీసుకొచ్చినప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తుకు రాలేదా?’’అని కేటీఆర్‌ను మంత్రి సీతక్క ప్రశ్నించారు.
హరీశ్ గౌరవం పోగొట్టుకుంటున్నరు
మహిళలకు అన్యాయం చేసేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నదని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘‘లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయని బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తున్నరు. బీఆర్ఎస్ హయాంలో 20 లక్షల మంది రైతులకు పైసా రుణమాఫీ కాలేదు. మా ప్రభుత్వం 27 రోజుల్లోనే రూ.18వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. బీఆర్ఎస్, దాని మిత్రపక్షం బీజేపీ కలిసి రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1,200కు పెంచారు.
మా ప్రభుత్వం పేదల భారాన్ని తగ్గించేందుకు రూ.500కే సిలిండర్‌ను అందిస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది. ట్విట్టర్ టిల్లు మాదిరి కేటీఆర్ వ్యవహరిస్తున్నడు. హరీశ్ రావు ఏమో.. వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెడ్తూ గౌరవం పోగొట్టుకుంటున్నడు’’అని సీతక్క ఎద్దేవా చేశారు.