ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ : మంత్రి సీతక్క

  • కేసులే ప్రామాణికం కాదు
  • ఉద్యమకారుల ఆకాంక్షలను బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదు
  • చాకలి ఐలమ్మ వంటి వారిని పట్టించుకోకుండానే తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన

హనుమకొండ, వెలుగు : ఉద్యమకారుల ఆశలు, ఆకాంక్షలను బీఆర్ఎస్ సర్కార్ ఎన్నడూ పట్టించకోలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క విమర్శించారు. చాకలి ఐలమ్మ వంటి ధీర వనితలను విస్మరించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ ఆర్ట్స్​ అండ్ సైన్స్​కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఎంతో మందికి సరైన గుర్తింపు లేదని, అధికార మార్పు కోరుకోవడానికి ఇది కూడా ఓ కారణమేనన్నారు. ఉద్యమకారులను గుర్తించేందుకు కేసులే ప్రామాణికం కాదన్నారు. నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీ వేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గద్దర్, శ్రీకాంతాచారి వంటి వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేస్తామన్నారు. ఉద్యమకారులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, కేసుల ఎత్తివేత గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

అంతకుముందు పలువురు ఉద్యమకారులు తమ సమస్యలు, డిమాండ్లతో మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఉమ్మడి జిల్లా చైర్మన్​గోధుమల కుమారస్వామి, కన్వీనర్​రేపల్లె సరోత్తమ సూరి, రిటైర్డ్​ ప్రొఫెసర్​ కూరపాటి వెంకటనారాయణ, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రియాజ్, సోషల్​డెమోక్రటిక్​ ఫోరం కోకన్వీనర్​ పృథ్వీరాజ్ పాల్గొన్నారు. 

అమరవీరుల స్తూపంలో బార్ అండ్ రెస్టారెంటా ? 

హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక స్థూపంలో బార్​ అండ్​ రెస్టారెంట్​ఎలా పెడతారని ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. బార్ అండ్ రెస్టారెంట్​తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్కను కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బార్ అండ్​రెస్టారెంట్ తొలగించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

భక్తులు స్వీయనియంత్రణ పాటించాలి

తాడ్వాయి, వెలుగు : మేడారం జాతరకు వచ్చే భక్తులు స్వీయనియంత్రణ పాటించాలని మంత్రి సీతక్క సూచించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. భక్తుల సౌకర్యం కోసం ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ఆరు వేల బస్సులు నడుపుతోందన్నారు. అనంతరం మేడారం పూజారులకు వస్త్రాలు అందజేశారు. ఆమె వెంట ఎస్పీ శబరీశ్, ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ, ఆఫీసర్లు రాజేందర్, రాజ్ కుమార్, తోట రవీందర్ పాల్గొన్నారు.


పగిడిద్దరాజు గుడిని అభివృద్ధి చేస్తాం

కొత్తగూడ, వెలుగు : పగిడిద్దరాజుగుడిని అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని పగిడిద్దరాజు గుడిని ఆదివారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా పగిడిద్దరాజు పూజారులకు ప్రభుత్వం తరఫున దుస్తులు, డోలు వాయిద్యాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పూనుగొండ్లలో నిర్వహించే తిరుగువారం జాతరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

గుడి వద్ద తాగునీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ ఏఈ నరేశ్ ను ఆదేశించారు. ఆమె వెంట మేడారం ట్రస్ట్​బోర్డ్ చైర్మన్ లచ్చుపటేల్, ఐటీడీఏ పీవో అంకిత్, మహబూబాబాద్​ డీఎస్పీ తిరుపతిరావు, గూడూరు సీఐ బి.రాజు, గంగారం ఎస్సై దీలీప్, ఐటీడీఏ ఈఈ హేమలత ఉన్నారు.