మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు నమ్మకం కలిగించాలి : మంత్రి సీతక్క

 మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు నమ్మకం కలిగించాలి : మంత్రి సీతక్క
  • ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందేలా చర్యలు చేపట్టాలి: మంత్రి సీతక్క
  • 100 శాతం ఇండ్లకు నల్లా నీటిని సరఫరా చేసే అధికారులను సన్మానిస్తామని వెల్లడి  

హైదరాబాద్, వెలుగు: మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు నమ్మకం కలిగించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా.. కొంతమంది ఇంకా బోర్లు వేయించాలని, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారని.. ఈ పరిస్థితి మారేలా మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది  పనిచేయాలని సూచించారు.  ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌ ఎర్రమంజిల్​లోని మిషన్ భగీరథ ఇంజినీర్- ఇన్- చీఫ్ ఆఫీసులో మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో శనివారం మంత్రి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. 

రాష్ట్రంలోని తాగునీటి సరఫరా, రాబోయే వేసవి సన్నద్ధతపై  సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన, శుద్ధిచేసిన తాగునీటిని అందించడం భగీరథ ఇంజినీర్ల బాధ్యత అని పేర్కొన్నారు. పైపులైన్లు లీకైనా, పగిలినా వెంటనే వాటిని బాగుచేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. ఈ క్రమంలో సంక్రమించే వ్యాధులు, అతిసారం  కేసుల విషయంలోనూ అప్రమత్తతో ఉండాలన్నారు. గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకుల్లో ప్రతిరోజూ క్లోరినేషన్ చేయాలని, 10 రోజులకొకసారి ట్యాంకులను శుభ్ర పరచాలని మంత్రి ఆదేశించారు.  

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..  

మిషన్ భగీరథ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. వంద శాతం ఇండ్లకు నల్లా నీటిని సరఫరా చేసే అధికారులను సన్మానిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 13,456 మంచినీటి సహాయకులకు శిక్షణ ఇచ్చామని, నీటి సమస్యలపై ఫిర్యాదుల కోసం త్వరలో టోల్ ఫ్రీ నంబర్​ను తెస్తామన్నారు. నీటి సరఫరాలో సమస్య తలెత్తుతున్న ఉట్నూరు వంటి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని డిప్యూట్ చేయాలని ఆదేశించారు. రాబోయే వేసవి కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో తాగు నీటి సరఫరాకు సంబంధించిన వార్తలు,  ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలని ఇంజినీర్లను ఆదేశించారు.