ఓడినా కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు అహంకారం తగ్గట్లే: మంత్రి సీతక్క

  • ఆదివాసీ క్యాండిడేట్లను కించపరచడం దొరతనానికి నిదర్శనం
  • దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది
  • మంత్రి సీతక్క

ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రజలు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను ఓడించినా కేటీఆర్‌‌‌‌‌‌‌‌ అహంకారం మాత్రం తగ్గలేదని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ మహిళలను డమ్మీ అభ్యర్థులు అంటూ కించపరచడం ఆయన దొరతనానికి నిదర్శనం అని అన్నారు. ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను ప్రారభించి, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. అనంతరం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పేదలకు అండగా ఉండే పార్టీ అని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో సుగుణక్కని గెలిపించి దొరకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తోందని విమర్శించారు. అయోధ్యలో గుడి కట్టానని చెబుతున్న మోదీ ఎన్ని బడులు ప్రారంభించారో చెప్పలేకపోవడం దారుణం అన్నారు. యువతకు అక్షింతలు కాదు.. ఉద్యోగాలు ఇవ్వాలంటూ సూచించారు. 75 సంవత్సరాల తర్వాత ఇక్కడ మహిళకు అవకాశం వచ్చిందని, ఆమెను గెలిపించి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌కు పంపించాలని కోరారు.

అనంతరం రెబ్బెన జడ్పీటీసీ ఏముర్ల సంతోష్‌, వాంకిడి ఎంపీపీ ముండే విణలబాయి, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ మల్లేశ్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌‌‌‌‌‌‌‌రావు, ఎంపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ ఆత్రం సుగుణ పాల్గొన్నారు.