మూసీ నిర్వాసితులకు పక్కా ఇండ్లు ఇస్తం: మంత్రి సీతక్క

 మూసీ నిర్వాసితులకు పక్కా ఇండ్లు ఇస్తం: మంత్రి సీతక్క

హైదరాబాద్: మూసీ నిర్వాసితులను బీఆర్ఎస్​నాయకులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఇవాళ గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం పక్కా ఇండ్లను కేటాయిస్తుందన్నారు.  నిర్వాసితులను ఆగం చేస్తూ.. బీఆర్ఎస్ రాజకీయ ఆక్కసు డ్రామాలడుతుందన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుంది. ప్రధాని మోదీ  రైతులకు నల్ల చట్టాలను అమలు చేస్తే కేసీఆర్​మద్దుతు పలికారు. బీఆర్ఎస్​అధికారంలో ఉన్నప్పుడు రైతులు పట్టించుకోలేదు.  

కనీసం సన్నవడ్లకు బోనస్​ఇవ్వలేదు. ఏకకాలంలో రూ. లక్ష రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు రైతుల పేరుతో దొంగ ధర్నాలు చేస్తున్నారు. ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా రైతుల కోసం బీఆర్ఎస్ మొసలి కన్నీరు పెడుతుంది. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్​లేదు.  వేల ఫామ్​హౌస్‎లకు ఫ్రీ కరెంట్​ఇచ్చిన కేసీఆర్​పేదల బాగు కోసం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తున్నాయి. సామాజిక న్యాయానికి కాంగ్రెస్​ కేరాఫ్​అడ్రస్. త్వరలోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుంది’ అని మంత్రి సీతక్క అన్నారు. 

కష్టపడి పనిచేయండి.. 

గడ్డ అన్నారం మార్కెట్​కు మంచి పేరు ఉందని, నూతన పాలకవర్గం కష్టపడి పనిచేయాలని మంత్రి సీతక్క తెలిపారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై ఫైట్​చేసిన చిలుక మధుసూదన్​రెడ్డి చైర్మన్​పదవి రావడం సంతోషంగా ఉందన్నారు.  రైతులకు మరింత ఉపయోగపడేలా ఈ మార్కెట్​ను తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు.  కాంగ్రెస్​ రైతు సంక్షేమ పథకాలను ఎప్పుటికప్పుడు రైతులు చేరుకునేలా నూతన పాలకవర్గ సభ్యులు పనిచేయాలన్నారు.