హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సోమవారం (జనవరి 27) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగు పథకాలు (రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు) కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువ అని ఎద్దేవా చేశారు.
పథకాలు మండలంలో ఒక్క గ్రామానికే అంటూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డ సీతక్క.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి తీరుతామని హామీ ఇచ్చారు. నాలుగు కొత్త పథకాల ప్రారంభోత్సవాలతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నదని అన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
తొలి విడతలో భాగంగా హైదరాబాద్ జిల్లాను మినహాయించి రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక గ్రామంలో నాలుగు పథకాలు ప్రారంభించారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క గ్రామంలోనే ఓట్లు అడిగిందా..? ఒక్క గ్రామ ప్రజలు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ నేతలు గెలిచారా..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అన్ని గ్రామాల్లో స్కీములు ఇంప్లిమెంట్ చేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలకు పై విధంగా మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.