ములుగు: బీజేపీ నేతలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేష్ బిధూరిపై చర్యలు తీసుకోకుండా గాంధీ భవన్‌పై బీజేపీ నేతలు దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. గాంధీ భవన్‌ను కూలుస్తానన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అక్కా చెళ్లెళ్లు లేరా..? వాళ్ల ఇంట్లో ఆడవారిని అవమానిస్తే ఇలాగే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఆడ బిడ్డలు ఓట్లు వేయకుండానే రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచారా అని నిలదీశారు. ఓట్ల కోసం ఓ మహిళా ఎంపీ శరీర అవయవాలపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతది ఏం ధర్మం..? ఆడవాళ్లను బీజేపీ గౌరవించే సంస్కృతి ఇదేనా..? అని కడిగిపారేశారు.
ALSO READ | నాంపల్లి సెంటర్లో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు : అసలు కారణం ఇదీ..!
కాగా, బీజేపీ మాజీ ఎంపీ, కల్కాజీ అసెంబ్లీ అభ్యర్థి రమేష్ బిధూరి ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా చేస్తానని అసభ్యకర కామెంట్స్ చేశారు. రమేష్ బిధూరి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే రమేష్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం (జనవరి 7) తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాంపల్లిలో బీజేపీ ప్రధాన కార్యాలయ ముట్టడికి యత్నించారు.
ALSO READ |
ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగి.. పరస్పరం భౌతిక దాడులు చేసుకున్నారు. అనంతరం బీజేపీ కార్యాలయ ముట్టడికి నిరసనగా బీజేపీ యువ మోర్చ గాంధీ భవన్ ముట్టడికి యత్నించింది. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పలువరు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.