వరదల్లోనూ బురద రాజకీయాలేనా : మంత్రి సీతక్క

వరదల్లోనూ బురద రాజకీయాలేనా : మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: వర్షాలు, వరదలతో ప్రజలు కష్టకాలంలో ఉంటే చేయూత ఇవ్వా ల్సింది పోయి కేటీఆర్, హరీశ్ రావు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకోలేని, సర్కారు సహాయ చర్యలను చూడలేని కబోదులు బీఆర్ఎస్ నేత‌‌లని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె మండిపడ్డారు. రూ.5 లక్షల తక్షణ సహాయం ప్రకటిస్తే.. బీఆర్ఎస్ నేతలు వరదల్లో బురద రాజకీయం చేస్తున్నారని మంత్రి సీతక్క మండి పడ్డారు.

ప్రజల కష్టాలు, నష్టాలు.. వాటి విలువలు కేసీఆర్ కుటుంబానికి తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు వానలు, వరదలపై తక్షణ సమీక్షలు చేసారా? కనీసం బాధితులను ఓదార్చారా? కొండగట్టులో బస్సు ప్రమాదంలో 63 మంది చనిపోతే కనీసం సంతాపం లేదు. రైతులు చనిపోతే పైసా పరిహారం ఇవ్వలేదు. నిరుద్యోగ అభ్యర్థులు చనిపోతే కనీసం ఓదార్పు లేదు.. ఇప్పుడెమో శవరాజకీయాలు. వరదల్లోనూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తమ నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు’’ అని మంత్రి సీతక్క అన్నారు.