- రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే కేటీఆర్ పని
- అప్పుడు రైతులను వంచించి.. ఇప్పుడు సానుభూతి నటిస్తున్నరు
- మీ ఆటలను రైతులు సాగనివ్వరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: అన్నదాతలకు అన్యాయం చేసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే కేటీఆర్ పని అని ఆమె మండిపడ్డారు. కేటీఆర్ ఆటలను రైతులు సాగనివ్వరని సీతక్క స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను వంచించి.. ఇప్పుడు సానుభూతి నటిస్తున్నారని మండిపడ్డారు. ఏకకాలంలో పంట రుణ మాఫీ చేయలేని అసమర్థ బీఆర్ఎస్ ను అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రైతులు తరిమికొట్టినా.. కేటీఆర్ కు బుద్ది రాలేదని అన్నారు.
ఆదిలాబాద్ లో రామ్‌లీలా మైదానంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయిన సీతక్క ఖండించారు. అధికారం కోల్పోయామన్న ఫ్రస్ట్రేషన్‌తో కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, తగిన రీతిలో సమాధానం చెప్తామని గురువారం ఓ ప్రకటనలో సీతక్క హెచ్చరించారు. తండ్రి చాటు బిడ్డగా పదేండ్లు మంత్రిగా పనిచేసి ఏం వెలగబెట్టని కేటీఆర్.. ఇప్పుడు సభ్యతా సంస్కారాలు మరచి సీఎం కుర్చీని అవమాన పరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఎరువులు, బోనస్ హామీలపై మోసం
రైతులకు ఉచిత ఎరువులు, సన్న వడ్లకు బోనస్ వంటి హామీలు ఇచ్చిన బీఆర్ఎస్.. వాటిని విస్మరించి రైతులను వంచించిందని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వరి వేస్తే ఉరే అని అన్నదాతలను ఆగం చేసిన మిమ్మల్ని రైతులు నమ్మరు. ధరణి పేరుతో రైతులను, కౌలు రైతులను దగా చేసిన మిమ్మల్ని క్షమించరు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరవక, తాలు, తరుగు పేరుతో క్వింటాకు మిల్లర్లు పది కిలోలు కోత విధించినా నోరు మెదపని మీరు ఇప్పుడు నోరు పారేసుకోవడం దేనికి? అకాల వర్షాలతో పంట నష్టపోతే కనీసం పరిహారం, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, పంటల బీమా పథకం లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను మార్చిన మీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు”అని అన్నారు.