- చెరువుల పరిరక్షణపై రెండు నాల్కల ధోరణి ఎందుకు?
- హైడ్రాకు అడ్డుపడితే జనం నుంచి ఛీత్కారం ఖాయం
హైదరాబాద్, వెలుగు : చెరువుల పరిరక్షణపై నాడు సుభాషితాలు పలికి, ఇప్పుడు విమర్శలు చేయడం బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుకే చెల్లిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘చెరువులే మన భాగ్య వనరులు’ అని పత్రికల్లో మంత్రిగా హరీశ్ వ్యాసాలు రాశారని, ఇప్పుడు హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ కోసం ఆవిర్భవించిన హైడ్రాను ఆడిపోసుకోవడం విడ్డూరంగా ఉందని గురువారం ఓ ప్రకటనలో ఆమె ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయ పేరుతో హడావుడి చేసి హైదరాబాద్ లో ఒక్క చెరువును కూడా కాపాడలేదని విమర్శించారు.
వాటి సర్వేను పూర్తి చేయకుండా, సరిహద్దులు గుర్తించకుండా కుట్రపూరితంగా వ్యవహరించారని, వారి తీరును కాగ్ 2020లోనే తప్పు పట్టిందని గుర్తుచేశారు. చెరువుల పరిరక్షణపై రెండు నాల్కల ధోరణిని విడనాడాలని హితవు పలికారు. ‘‘తొమ్మిదిన్నరేండ్లు అధికారం అనుభవించిన మీరు (బీఆర్ఎస్ నేతలు) హైదరాబాద్ లో చెరువులు విధ్వంసానికి గురవుతుంటే మౌనం వహించారు. హైదరాబాద్ లోని చెరువులను చెరబట్టిన కబ్జాకోరులు వాటిని చెంబులుగా మార్చినప్పుడు మీరు నిర్లక్ష్యం చూపారు. మీ హయంలో రాజధానిలో వందలాది చెరువులు కనుమరుగయ్యాయి. వర్షాకాలంలో వరదనీరు పోయే దారి, ఉండే దారి లేక ఏటా పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలకు కొమ్ముకాసి చెరువులను నాశనం చేసింది. హైదరాబాద్ శీతోష్ణస్థితిని కాపాడే చెరువులను బతికించుకోకపోతే.. ఉక్కపోత, వేడి, వరదలే హైదరాబాద్ కు శాపంగా మారే ప్రమాదం ఉంది” అని సీతక్క పేర్కొన్నారు. హైడ్రాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజల ఛీత్కారాలకు గురికాకతప్పదని మంత్రి హెచ్చరించారు.