- స్మగ్లింగ్ సినిమాలకు అవార్డులా .. స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరోనా?: సీతక్క
- చట్టాన్ని కాపాడే పోలీసులు జీరోలా?
- ఇలాంటి సినిమాలతో సమాజానికి నష్టం
- మంచి సందేశాత్మక సినిమాలు రావాలి
- అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. పదేపదే బుకాయించారన్న మంత్రి
ములుగు, వెలుగు: నేర ప్రవృత్తిని ప్రోత్సహించే సినిమాలతో సమాజానికి నష్టం జరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. మంచి సందేశాత్మక సినిమాలు తియ్యాలని సూచించారు. సోమవారం ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ప్రోత్సహించే సినిమాకు జాతీయ అవార్డులు ఇవ్వడమేంటి..? అని ప్రశ్నించారు.
‘‘అన్యాయం జరిగినప్పుడు న్యాయం ఎలా పొందవచ్చు అని తెలియజేస్తూ మంచి సందేశం ఇచ్చిన జైభీమ్ లాంటి సినిమాలకు అవార్డులు ఎందుకు ఇవ్వలేదు..? అంటే అణగారిన వర్గాల ప్రజలు ఇంకా అలాగే ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమా? అందుకే జైభీమ్ సినిమాను గుర్తించలేదా?” అని సీతక్క మండిపడ్డారు.
‘‘స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరో ఎట్లయితడు? అతను పోలీసులను బట్టలిప్పించి కూర్చోబెడతాడా? మంచిగా చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్ అయి వచ్చినోళ్లు.. చట్టాన్ని కాపాడే పోలీసులు జీరోలా..? ఇది ఎంత వరకు కరెక్టు..? స్మగ్లర్లు, దొంగలు, లంగలు హీరోలు అని.. వాళ్లు చట్టం నుంచి ఈజీగా తప్పించుకుంటరని చూపెట్టుడు మంచిదా..? ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న సినిమాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
తాము కూడా షార్ట్ కట్ లో తొందరగా కోట్లకు ఎదగాలని యువత అలాంటి ఆలోచనలు చేస్తరు” అని సీతక్క అన్నారు. ఇటీవల థియేటర్ లో పుష్ప 2 సినిమా చూస్తూ రెండు మర్డర్లు చేసిన నేరస్తులు దొరికారని చెప్పారు. ‘‘ప్రజలను మంచి మార్గంలో నడిపించేలా సందేశాత్మక సినిమాలు తీయాలి. లేదంటే జీవితంపై ప్రజలకు నమ్మకం కలిగించే సినిమాలు, వాళ్లు హాయిగా నవ్వుకునేలా కామెడీ సినిమాలు తీయాలి” అని సూచించారు.
బీఆర్ఎస్, బీజేపీ రాజకీయం చేస్తున్నయ్..
సినిమా రంగానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని సీతక్క స్పష్టం చేశారు. ‘‘సినిమాలంటే మాకు ఇష్టం. కానీ సందేశాత్మక సినిమాలు రావాలి. అలాంటి సినిమాలను ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుంది” అని చెప్పారు. సందేశాత్మక సినిమాలనే ఆదరించాలని ప్రజలకు సూచించారు. అల్లుఅర్జున్ ఇష్యూపై బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం టైమ్ లో సినిమా యాక్టర్లు, థియేటర్ల మీద రాళ్లు వేసి లబ్ధి పొందింది బీఆర్ఎస్ వాళ్లేనని ఫైర్ అయ్యారు.
ఆనాడు తెలంగాణ సిన్మాలు తెస్తామని చెప్పినోళ్లు.. ఇయ్యాల తెలంగాణ బిడ్డ చనిపోతే, తప్పు చేసిన హీరోకు మద్దతు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో డ్రగ్స్, క్లబ్స్, పబ్స్ కల్చర్ ను పెంచారు. సీఎం రేవంత్ రెడ్డి వాటిని కట్టడి చేయడంతో.. కొందరు కుట్రలు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ నుంచి సినీ పరిశ్రమను వెళ్లాగొట్టాలని ప్రభుత్వం చూస్తున్నదని అసత్య ప్రచారం చేస్తున్నరు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పరిశ్రమ అయినా చట్టం ప్రకారం నడవాల్సిందేనని స్పష్టం చేశారు.
క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. బుకాయింపు
చట్టం ముందు అందరూ సమానమేనని సీతక్క అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. అల్లు అర్జున్, ఆయన కుటుంబంపై తమకెలాంటి ద్వేషం లేదని తెలిపారు. ‘‘తన అభిమాన హీరో సినిమా చూడడానికి వెళ్లి ఒక మహిళ చనిపోయింది. కానీ ఆయన పది రోజులైనా ఆమె కుటుంబాన్ని పరామర్శించలేదు.
వాళ్లకు ఇస్తానన్నా సాయం కూడా అందజేయలేదు. అంతేకాకుండా తన తప్పేం లేదన్నట్టు బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో వాస్తవాలన్నీ సీఎం అసెంబ్లీలో బయటపెట్టారు. దాన్ని కూడా తప్పుపడుతూ ఆ హీరో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టారు. తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాల్సింది పోయి.. మళ్లీ బుకాయించే ప్రయత్నం చేశారు” అని అన్నారు.