హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. పదేండ్లలో మూసీ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఒక్క రూపాయి కేటాయించని కేంద్రం ముందు ధర్నా చేయాలని బీజేపీ నేతలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆమె సూచించారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయనతో రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కిషన్ రెడ్డి.. ఇప్పుడు మూసీ ప్రాంత ప్రజల తరఫున ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని ప్రకటనలో సీతక్క విమర్శించారు. ‘‘ఈ నెల 25న తలపెట్టిన ధర్నాను బీజేపీ విరమించుకోవాలి. మూసీ పరీవాహక ప్రాంతం నుంచే ముగ్గురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్నరు.
కేంద్రంతో చర్చించి హైదరాబాద్ లైఫ్లైన్గా భావించే మూసీ పునరుజ్జీవం కోసం రూ.10వేల కోట్లను మంజూరు చేయించాలి. ఎక్కడ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందో అని బీజేపీ నేతలు భయపడ్తున్నరు. నిజంగా మూసీ పరీవాహక ప్రాంత ప్రజలపై ప్రేమ ఉంటే.. పదేండ్లు ఏం చేశారు? ఎందుకు పట్టించుకోలేదు? మూసీ నిర్వాసితుల్లో ఎవరినీ బలవంతంగా తరలించలేదు’’అని మంత్రి సీతక్క తెలిపారు. అందరికీ స్థిర నివాసం, ఉపాధి కల్పించిన తర్వాతే పునరుజ్జీవ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
పదేండ్లలో పైసా ఇవ్వలేదు
యూపీఏ హయాంలో మూసీ ప్రక్షాళన కోసం రూ.335 కోట్లు మంజూరైతే.. మోదీ పాలనలో పైసా రాలేదని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నిధుల విషయమై బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు? ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలోని గంగా ప్రక్షాళన కోసం కేంద్రం రూ.11వేల కోట్లు ఖర్చు చేసింది. ఇతర నదుల ప్రక్షాళన కోసం రూ.6వేల కోట్లు మంజూరు చేసింది. మూసీ ప్రక్షాళన కోసం పైసా కేటాయించకపోవడం తెలంగాణపై కేంద్రం వివక్షకు నిదర్శనం. ధర్నాలు చేయడం మానేసి కేంద్రం నుంచి నిధులు తెచ్చే దానిపై దృష్టి పెట్టాలి.
రెండేండ్ల కింద వరదలు వచ్చినప్పుడు బండికి.. బండి ఇస్తామని అన్నరు. ప్రతి ఇంటికి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన్రు. ఒక్కరిని కూడా ఆదుకోలేదు’’అని సీతక్క విమర్శించారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సమర్థిస్తున్న బీజేపీ.. ఇక్కడ మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నదని ప్రశ్నించారు.