బీజేపీ పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేదు: మంత్రి సీతక్క

  • రిజర్వేషన్ల తొలగించేందుకు ఆ పార్టీ కుట్ర పన్నుతోంది 
  • కేసీఆర్ చేసిన అప్పులకు రూ. 29 వేల కోట్ల వడ్డీ కట్టినం
  • వచ్చేనెల 2న ఆసిఫాబాద్ లో సీఎం రేవంత్​ రెడ్డి సభ
  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క

ఆసిఫాబాద్, వెలుగు: బీజేపీ పాలనలో సామాన్యులు బతికే పరిస్థితులు లేవని, వచ్చే పార్లమెంట్​ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఓటర్లకు పిలుపునిచ్చారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆసిఫాబాద్ మండలం అప్పెపెల్లి, అంకుసాపూర్, మోతుగుడ గ్రామాల్లో అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ప్రచారం నిర్వహించారు. వచ్చే నెల 2న ఆసిఫాబాద్​లో నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి జన జాతర సభ కోసం స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం కెరమెరిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లు తొలగించి వారికి తీరని అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని తీసేసి పేదల హక్కులు కాలరాసే విధంగా ఆలోచన చేస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్​కు ఓట్లు వేస్తే పుస్తెలు గుంజుకుపోతారని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్​పోతూ పోతూ రూ. 7 లక్షల కోట్లు అప్పు చేశా రని, వాటికి ఇప్పటికే రూ.29 వేల కోట్ల వడ్డీ కట్టామని చెప్పారు.

ఆ డబ్బులే ఉంటే అందరికీ రైతు బంధు, రుణమాఫీ అయ్యేదన్నారు. మే 2న ఆసిఫాబాద్​లో నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి సభను సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, నియోజకవర్గ ఇన్ చార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ ఎంపీపీ బాలేశ్ గౌడ్, లీడర్లు మునీర్ అహ్మద్, రాథోడ్ గణేశ్, మసాదే చరణ్, కుసుంరావు పాల్గొన్నారు.