కొత్తగా పోడు కొట్టొద్దు.. పాత భూములు వదలొద్దు

కొత్తగా పోడు కొట్టొద్దు.. పాత భూములు వదలొద్దు
  • ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరిస్తం
  • కలెక్టర్లకు ఫుల్ పవర్స్ ఇచ్చాం
  • ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తం
  • ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క
  • ఆరోగ్య మందిరాలు, పీహెచ్​సీలు, పల్లె దవాఖానాలు ప్రారంభించిన మంత్రి

ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలన సమర్థంగా సాగుతోందని ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వ పథకాలు, పాలసీల అమలులో కలెక్టర్లది కీలక పాత్ర అని, సమర్థంగా నిర్వహించాలన్నారు. మంత్రి సీతక్క ఆదివారం ఆసిఫాబాద్ ​జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.

కాగజ్ నగర్ పట్టణంతో పాటు మండలంలో కొత్తగా నిర్మించిన అయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిరాలు, పీహెచ్​సీని, మార్కెట్ యార్డులో మిషన్ భగీరథ నీళ్ల సరఫరాను ప్రారంభించారు. అనంతరం రెబ్బెన మండల కేంద్రంతోపాటు మండలంలోని నవెగాం, ఖైర్ గాంలో పల్లె దవాఖానాలు, గంగాపూర్​లో కస్తుర్బా గాంధీ విద్యాలయం, లింగాపూర్, సిర్పూర్ యు మండల కేంద్రాల్లోని కస్తుర్బా పాఠశాలల్లో నిర్మించిన అదనపు తరగతి గదులను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, వేణు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

ప్రజలకు మేలు జరిగేలా పనులు చేయాలి

ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని సమస్యలను  పరిష్కరించేందుకు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇచ్చారని అన్నారు. అధికార ప్రతిపక్షం, ప్రజాప్రతినిధులు, నాయకులు ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు మేలు జరిగేలా పనులు చేయాలని కోరారు. గిరిజనులు కొత్త పోడు భూములను కొట్టే ప్రయత్నం చేయొద్దని, పాత పోడు భూములను వదలొద్దని సూచించారు.

పోడు సమస్యల పరిష్కారానికి గతం ప్రభుత్వ హయాంలో ఏనాడూ కలెక్టర్లు మోఖా మీదకు వెళ్లలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్లు, డీఎఫ్ఓలు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కస్తామని హామీ ఇచ్చారు. సిర్పూర్ నుంచి మొదలు ఖమ్మం, అచ్చంపేట వరకు పోడు సమస్య ఉందని, కొన్ని చోట్ల అనుమతి లేదంటూ కేంద్రం పోడు పట్టాలను డిలీట్ చేస్తోందని ఆరోపించారు. గత పదేండ్ల కాలంగా కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదన్నారు. అయినప్పటికీ తాము రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల మేలు కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

గ్రామీణ విద్యార్థులకు అన్ని రకాల విద్యా సౌకర్యాలు

ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలో డైట్ కాలేజీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కాలేజీలో చేరే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తరగతులకు సంబంధించి జూలై 7న ఆదిలాబాద్​లో జరిగే సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల విద్యా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలనే  దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్యే హరీశ్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.