పదేండ్ల తర్వాత గ్రామసభలు.. అర్హులందరికీ పథకాలు అందజేస్తం: మంత్రి సీతక్క

పదేండ్ల తర్వాత గ్రామసభలు.. అర్హులందరికీ పథకాలు అందజేస్తం: మంత్రి సీతక్క


= గతంలో ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే పథకాలు
= ఇప్పుడు ప్రజల సమక్షంలోనే ఎంపిక
= నిన్న 3,410 గ్రామాల్లో సభలు పెట్టాం
= 142 ఊళ్లలోనే ఆందోళనలు జరిగినయ్
= ఆ 4% గ్రామాల్లోనూ గొడవ చేసింది బీఆర్ఎస్ వాళ్లే
= గ్రామ సభల్లోనూ దరఖాస్తుల స్వీకరణ
= అర్హులందరికీ పథకాలు అందజేస్తం
= మీడియాతో మంత్రి సీతక్క చిట్ చాట్

హైదరాబాద్: పదేండ్ల తర్వాత తెలంగాణలో గ్రామ సభలు జరుగుతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. గత  ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే  పథకాలు అందేవని, ఫాంహౌస్‎లలో లబ్దిదారుల జాబితాలు తయారయ్యేవని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా పథకాలు అందించనుందని చెప్పారు. గ్రామ సభలు  నిర్వహించి ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ఇవాళ మంత్రి మీడియాతో చిట్ చాట్ చేశారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా  3,410 గ్రామాల్లో సభలు నిర్వహించామని అన్నారు. కేవలం142 గ్రామాల్లోనే ఆందోళనలు జరిగాయని అన్నారు. 

అంటే కేవలం 4% గ్రామాల్లోనే గొడవలు జరిగాయని తెలిపారు. అది కూడా బీఆర్ఎస్ నాయకులు కావాలనే గొడవలు చేయించారని చెప్పారు. 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో సభలు జరిగినట్టు మంత్రి చెప్పారు. పదేండ్ల తర్వాత గ్రామ సభలు నిర్వహిస్తున్నందున ప్రజలు ఉత్సాహంగా హాజరవుతున్నారని చెప్పారు.  ప్రజాస్వామ్య బద్ధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్లుగా బీఆర్ఎస్ సర్కారు రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు.

 కేసీఆర్, కేటీఆర్ మాటలు  నమ్మి కొందరు ఆర్థిక రాజకీయ, సామాజిక సర్వేలో పాల్గొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్లకు  పథకాలు రావేమోననే ఆందోళన ఉందని అన్నారు. అర్హులందరికీ పథకాలు అందుతాయని, ఆందోళన చెందవద్దని సీతక్క అన్నారు. గ్రామసభల్లో కూడా దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. వందల ఎకరాల భూమి ఉన్నవారికి గతంలో  రైతు బంధు ఇచ్చారని గుర్తు చేశారు.  

త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు

ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ముగించుకొని వచ్చాక బీసీ కమిషన్ రిపోర్ట్‎పై ఆమోద ముద్రపడుతుందని సీతక్క చెప్పారు. త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని, ప్రత్యేక అధికారుల పాలన కారణంగా కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయని అన్నారు. స్కీంలకు దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని చెప్పారు.