ప్రజా సేవలో అవినీతికి ఆస్కారమివ్వొద్దు : మంత్రి సీతక్క

ప్రజా సేవలో అవినీతికి ఆస్కారమివ్వొద్దు :  మంత్రి సీతక్క
  • ఏసీ రూముల్లో ఉంటే ప్రజల సమస్యలు తెలియవు
  • వారంలో రెండు రోజులు ఫీల్డ్ విజిట్ చేయాలె 
  • సీజనల్ వ్యాధులపై ప్రణాళికతో ముందుకెళ్లాలి
  • జిల్లా అధికారులతో రివ్యూలో ‌మంత్రి సీతక్క 
  • పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి 

ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాలు పేదలకు అందించడం, ప్రజా సేవలో అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దని ఉమ్మడి ఆదిలాబాద్​ఇన్​చార్జి మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పర్యటించారు. అనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తాతో కలిసి రివ్యూ నిర్వహించారు.

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై ప్రణాళిక రూపొందించాలని, ఈ మూడు నెలలు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదలు, విషజ్వరాలు, హాస్టల్స్, స్కూళ్లలో సమస్యలపై ఫోకస్ పెట్టాలన్నారు. మిషన్ భగీరథ, రహదారులు, వైద్యం, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇరిగేషన్, అంగన్ వాడీ కేంద్రాలపై మంత్రి సమీక్షించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. 

పెండింగ్​లో ఉన్న రోడ్లు, వంతెన పనులను త్వరగా పూర్తిచేయాలి

మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సరఫరా అవుతున్న పౌష్టికాహారం, గుడ్లు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో అధికారులకు ప్రజాప్రతినిధులు సహకరించాలని, మంచి నిర్ణయాలతో జిల్లాను ముందంజలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు.

గతంలో మిషన్ భగీరథ పనులు సరిగా చేపట్టకపోవడంతో గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తుతోందని, ఇంటింటికీ నీరు అందించేలా పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రహదారులు, అంతర్గత రహదారులు, పెండింగ్​లో ఉన్న వంతెనల పనులను ప్రణాళిక ప్రకారం చేపట్టి త్వరగా పూర్తిచేయాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో దివ్యాంగులకు ల్యాప్ టాప్ లు,  4జీ ఫోన్, క్యాలిపర్స్, బ్యాటరీ వీల్ చైర్, బ్యాటరీ ట్రై సైకిల్స్, కర్రలు, ఇతర పరికరాలు, టీచింగ్ కి సంబంధించిన పుస్తకాలను లబ్ధిదారులకు మంత్రి సీతక్క  పంపిణీ చేశారు. 

ప్రజా సమస్యలు తెలియాలంటే ఫీల్డ్​కి వెళ్లాలి

ఏసీ రూముల్లో కూర్చుంటేనే అన్ని పనులు అవుతాయని అనుకోవద్దని, ప్రజా సమస్యలు తెలియాలంటే ఫీల్డ్ విజిట్ చేయాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. వారంలో రెండు రోజులు ఫీల్డ్ కు వెళ్లి పనిచేస్తే ప్రజా సమస్యలు తర్వగా పరిష్కారమవుతాయన్నారు. వృత్తికి న్యాయం చేసినప్పుడే ఆత్మ సంతృప్తి లభిస్తుందన్నారు. నిజాయతీగా, బాధ్యతాయుతంగా పనిచేస్తే మీ పిల్లలు కాలర్ ఎగరేసుకుంటారని పేర్కొన్నారు. 

మీ ప్రాణాలను కాపాడుకుంటూ ప్రజలను రక్షించాలి

మీ ప్రాణాలను కాపాడుకుంటూనే ప్రజలను రక్షించాలని విపత్తు బృందాలకు మంత్రి సీతక్క సూచించారు. జిల్లా కేంద్రంలోని మావల పార్కులో జిల్లా విపత్తు నిర్వహణ బృందం డీడీఆర్ఎఫ్(డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)ను మంత్రి ప్రారంభించారు. ఆపత్కాల సమయంలో ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను త్వరగా కాపాడేలా పోలీస్​సిబ్బంది ద్వారా జిల్లాలో సొంతంగా డీడీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రెస్క్యూబోట్, మోటర్ మెషీన్స్, మెడికల్ స్ట్రక్చర్స్, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, వుడ్ కట్టర్ మెషీన్స్​ను మంత్రి ప్రారంభించారు.

డీడీఆర్ఎఫ్ బృందాల పనితీరును ఎస్పీ గౌస్ ఆలం మంత్రికి వివరించారు. వనమహోత్సవంలో భాగంగా మావల పార్కులో మంత్రి మొక్కలు నాటారు. కొద్దిసేపు ఓపెన్ టాప్ జీపులో పార్కులో తిరుగుతూ అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఉట్నూర్ మండలంలోని రాంలింగంపేట నుంచి శ్యామ్ నాయక్ తండా వరకు రూ.375 కోట్లతో నిర్మించిన తారు రోడ్డుతో పాటు వంతెనను, ఇంద్రవెల్లి మండలంలోని అమరవీరుల స్థూపం వద్ద స్మృతివనం అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామాల్లో అన్ని విధాలుగా సౌకర్యాలను కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

రాథోడ్ ​రమేశ్​ కుటుంబానికి పరామర్శ

ఇటీవల చనిపోయిన మాజీ ఎంపీ రాథోడ్​రమేశ్​కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. ఆదివారం రాత్రి ఉట్నూర్​మండల కేంద్రంలోని ఆయన ఇంటికి చేరుకొని రమేశ్​ఫొటోకు నివాళి అర్పించారు. సతీమణి, మాజీ ఎమ్మెల్యే సుమన్​ బాయి, కొడుకు రాథోడ్​రితీశ్, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉమ్మడి జిల్లా తిరుగులేని నాయకుడిని కోల్పోయిందని అన్నారు.