ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్య రావొద్దు : మంత్రి సీతక్క

ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్య రావొద్దు : మంత్రి సీతక్క
  • మిషన్ ​భగీరథ సిబ్బంది అలర్ట్‌‌గా ఉండాలి
  • తాగునీటి సమస్యపై బీఆర్ఎస్‌‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నరని ఫైర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: గతంలో తాగునీరు అందని గ్రామాలకు కూడా నీరు సరఫరా చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు. మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్ వంటి జిల్లాలతోపాటు ఏజెన్సీ గ్రామాల్లోనూ తాగునీటి సమస్యలు రానివ్వొద్దని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌‌లోని మిషన్ భగీరథ ఆఫీస్‌‌లో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెంపరేచర్లు పెరుగుతుండటంతో రిజర్వాయర్లలో నీటి లభ్యత, తాగునీటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆమె అధికారులతో సమీక్షించారు. బీఆర్ఎస్ అధికారం పోగానే తాగునీరు రావ‌‌ట్లేదని పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు.

 మిష‌‌న్ భ‌‌గీర‌‌థ‌‌లో అప్పటి అధికారులు, సిబ్బందే ప‌‌నిచేస్తున్నారని, స‌‌మ‌‌స్యలు తలెత్తే ప‌‌రిస్థితి లేదని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు పాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సాంకేతిక కారణాలతో అవాంత‌‌రాలు ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, తాగునీటి అవసరాల కోసం ప్రతీ కలెక్టర్ వద్ద రూ.2 కోట్ల నిధులను అందుబాటులో ఉంచామని చెప్పారు. మిష‌‌న్ భ‌‌గీర‌‌థ హెడ్ ఆఫీస్ లో 24 గంట‌‌ల పాటు ప‌‌ని చేసేలా కాల్ సెంట‌‌ర్ ఏర్పాటు చేశామని, మిష‌‌న్ భ‌‌గీర‌‌థ కొత్త ప‌‌నుల కోసం రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో స‌‌మ‌‌స్యల‌‌ను ప‌‌రిష్కరించేలా గ్రామాల్లో మంచినీటి స‌‌హాయ‌‌కుల‌‌ను నియ‌‌మించామన్నారు. 

సరఫరాపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలి.. 

క‌‌లెక్టర్లు, ఎమ్మెల్యేల‌‌తో మిష‌‌న్ భ‌‌గీర‌‌థ అధికారులు జిల్లాలవారీగా స‌‌మావేశాలు నిర్వహించాలని మంత్రి సీతక్క సూచించారు. తాగునీటి సమస్యలు లేకున్నా కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాన్ని ఖండించాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా సరిగా చేయకున్నా, తప్పుడు వార్తలను ఖండించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచి నీటి స‌‌ర‌‌ఫరాపై తనకు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని, స‌‌మ‌‌స్యలు ఎదురైతే తీస్కున్న చర్యలేంటో కూడా నివేదించాలని ఆదేశించారు. సమీక్షలో  పీఆర్, ఆర్డీ సెక్రటరీ డీఎస్ లోకేశ్​కుమార్, మిష‌‌న్ భ‌‌గీర‌‌థ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈలు, డీఈలు పాల్గొన్నారు.