బ‌కాయిలు పెట్టి.. బుకాయింపులా..? కేటీఆర్‎కు మంత్రి సీతక్క ​ కౌంటర్​

బ‌కాయిలు పెట్టి..  బుకాయింపులా..? కేటీఆర్‎కు మంత్రి సీతక్క ​ కౌంటర్​

హైదరాబాద్: కాంగ్రెస్​ ప్రభుత్వం10 నెలల్లోనే రూ.80,500 కోట్ల అప్పులు చేసిందన్న మాజీ మంత్రి కేటీఆర్​ట్వీట్‎కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తొమ్మిదిన్నరేండ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చారని.. అప్పుల వార‌సత్వానికి ఆద్యులే మీరు అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘మీ హయాంలో అక్షరాల రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారు. వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు టంచ‌న్‎గా రూ.207 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అంటే ప్రతి నెల స‌గ‌టున 6 వేల కోట్ల ప్రజాధనాన్ని మీ అప్పుల కుప్పను కడగడానికే స‌రిపోతుంది. 

అప్పుల అప్పారావు లాగా అందిన కాడల్లా అప్పులు చేసి.. రాష్ట్రాన్ని తిప్పలు పెట్టి, వడ్డీలతో ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిన మిమ్మల్ని దేనితో కొట్టాలి. అప్పులు చాల‌వ‌న్నట్లు వేల కోట్ల బ‌కాయిల‌ను మీరు చెల్లించ‌లేదు. చేసిన ప‌నుల‌కూ బిల్లులు చెల్లించ‌లేదు. 5 వేల కోట్ల ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ బ‌కాయిలు, ఆరోగ్య శ్రీ, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, సర్పంచుల‌కు, ఆర్టీసీ, గురుకుల భ‌వ‌నాల ఓన‌ర్లకు అద్దె బ‌కాయిలు, ఉద్యోగుల‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధుల పెండింగ్.. ఇలా ప్రతి శాఖ‌లో వంద‌ల కోట్ల బ‌కాయిలు పెట్టి.. ఇప్పుడు బుకాయిస్తే ఎలా?’ అని ఫైర్​అయ్యారు. 

ఎన్నో పథకాలకు శ్రీకారం

‘మీ నిర్వాకంతో గాడి త‌ప్పిన ఆర్థిక వ్యవ‌స్థను గాడిలో పెడుతూ ఈ ప‌ది నెల‌ల కాలంలో 18 వేల కోట్ల పంట రుణాల‌ను ప్రజా ప్రభుత్వం మాఫీ చేసింది. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణం, మ‌హిళ‌ల వంటింటి భారం దించేందుకు రూ. 500 కే గ్యాస్ సిలిండ‌ర్, సామాన్యుల‌కు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ వంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నం. ఇప్పటికే 60 వేల‌కు పైగా ప్రభుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేశాం. ఇందిర‌మ్మ ఇండ్లు, కొత్త రేష‌న్ కార్డులు, ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక ప‌థ‌కాల‌కు శ్రీకారం చుట్టాం. అయినా మీరు అప్పులు, బ‌కాయిలు, హామీల గురించి నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లే ఉంది’ అని సీతక్క ఎద్దేవా చేశారు.

ALSO READ | మూసీపే సవాల్.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్..!