- ఎమ్మెల్యే కేటీఆర్కు మంత్రి సీతక్క కౌంటర్
- సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా?
- ఫైనాన్స్ కమిషన్ నిధులు, పెండింగ్ బిల్లులివ్వకుండా వాళ్ల ఉసురు పోసుకున్నారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతోనే సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ‘‘ఆనాడు గ్రామ పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇవ్వకుండా, సర్పంచ్ లకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టిన బీఆర్ఎస్.. ఇప్పుడు మా ప్రభుత్వాన్ని విమర్శించడం తగదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీరు చూస్తుంటే.. హంతకులే సంతాపం చెప్పినట్టుంది” అని విమర్శించారు. ఈ మేరకు బుధవారం మంత్రి సీతక్క ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్త పాలనతో పల్లెలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో ఏండ్ల తరబడి పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు. సర్పంచ్ లకు బిల్లులు చెల్లించలేదు. అన్ని శాఖల్లో కలిపి రూ.72 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వారసత్వంగా వదిలిపోయారు. ఆ పాపాన్ని ఇప్పుడు మా ప్రభుత్వం మోయాల్సి వస్తున్నది” అని చెప్పారు. ‘‘పంచాయతీలకు 20 నెలలుగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు. కానీ 8 నెలలుగా మాత్రమే నిధులు రావట్లేదని మీరు (కేటీఆర్) పచ్చి అబద్ధాలు చెప్పారు. అధికారం పోయిందన్న నిరాశ నిస్పృహతో.. 8 నెలల్లో మేం ఏమీ చేయలేదన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మీరు అలా ట్విట్టర్ లో ఎంత మొత్తుకున్నా ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. మీ పాపాన్ని మా ఖాతాలో వేయాలని చూస్తున్నారు. మీ దిగజారుడు రాజకీయానికి ఇది పరాకాష్ట” అని సీతక్క మండిపడ్డారు.
మీరిచ్చిన నిధులన్నీ ఎటు పోయినయ్?
సర్పంచ్ లకు బిల్లులు చెల్లించకుండా ఏండ్లకేండ్లు పెండింగ్ లో పెట్టిన బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని గగ్గోలుపెట్టడం హస్యాస్పదమని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘‘గ్రామ పంచాయతీలను సంక్షోభంలో నెట్టి, ఎందరో సర్పంచ్ ల ఉసురు తీసిన మీకు.. ఇప్పుడు సానుభూతి వచనాలు పలికే నైతిక అర్హత ఉందా? చేసిన పనులకు బిల్లులు రాక మీ (కేటీఆర్) సొంత నియోజకవర్గం సిరిసిల్లలోని ఇల్లంతకుంట మండలం సోమారంపేట సర్పంచ్ వడ్డే ఆనందరెడ్డి ఆత్మహత్య చేసుకున్నప్పుడు మౌనంగా ఉన్న మీకు.. ఇప్పుడు మాట్లాడే హక్కు ఉందా?” అని ప్రశ్నించారు.
‘‘మీ ప్రభుత్వంలో ప్రతినెలా పంచాయితీలకు ఠంచన్ గా రూ.275 కోట్లు విడుదల చేస్తే.. ఆ నిధులన్నీ ఎక్కడికి పోయాయి? పల్లెలు అభివృద్దికి ఎందుకు నోచుకోలేకపోయాయి? ఆ చేయితో ఇస్తూ ఈ చేయితో పంచాయితీల నిధులు కాజేసింది మీరు కాదా? సర్పంచ్ లకు తెలియకుండానే కేంద్ర నిధులను దొంగచాటుగా దారి మళ్లించిన చరిత్ర మీది” అని కేటీఆర్ పై సీతక్క మండిపడ్డారు.