- వానలు తగ్గే వరకు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
- లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి
- కొట్టుకుపోయిన బ్రిడ్జిల వద్ద తాత్కాలిక రవాణాకు చర్యలు తీసుకోండి
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
- జిల్లాలోని ఏరియాలు పరిశీలన
ములుగు/ ఏటూరునాగారం/ తాడ్వాయి/ వెంకటాపురం/ వెలుగు: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని, గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీశ్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్, అడిషనల్కలెక్టర్ శ్రీజతో కలిసి ములుగు జిల్లాలోని ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో వరద ప్రవాహ ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. ముందుగా ములుగు మండలం బండారుపల్లి వద్ద కల్వర్టు కూలిపోగా, అక్కడ వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో పునరుద్ధరించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రామప్ప సరస్సులోకి వరద ఉధృతి వెళ్లే మేడివాగును సైతం మంత్రి పరిశీలించారు.
అనంతరం గోవిందరావుపేట మండలంలోని దయ్యాలవాగు, రాళ్లవాగుల ప్రవాహాన్ని, గుండ్లవాగు ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించాలన్నారు. వెంగ్లాపూర్, ప్రాజెక్టు నగర్ గ్రామాల ప్రజలను కలిసిన మంత్రి అప్రమత్తంగా ఉండాలన్నారు. తాడ్వాయి మండలం మేడారం వద్ద జంపన్నవాగు నీటి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. నార్లాపూర్, చింతల్ క్రాస్, ఎలుబాక గ్రామాల మధ్యలో జంపన్న వాగులో వరద ఉధృతిని పరిశీలించి, వాగుపై ఉన్న జంట వంతెనల వద్దకు చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. వాగు ఒడ్డున ఉన్న చిరువ్యాపారులతో మాట్లాడి వరద గురించి అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
అనంతరం వాజేడు మండలం పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గోదారమ్మ శాంతించు అంటూ పూజలు చేశారు. వాజేడు మండలం బొగత పరవళ్లను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ అపాయకరమైన ప్రదేశాలకు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
తాత్కాలిక ఏర్పాట్లు చేయాలి..
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ కొట్టుకపోయిన బ్రిడ్జిల వద్ద రవాణాకు ఇబ్బందులు ఎదురు కాకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్లపై నీటి ప్రవాహం అధికంగా ఉన్న రూట్లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. లోతట్టు గ్రామాల ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సేవలు వినియోగించుకోవాలన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్, ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజలు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
దొడ్ల-కొండాయి వద్ద జంపన్న వాగు పై రూ.9.30 కోట్లతో నూతన వంతెన, రూ.5 కోట్లతో బొగ్గుల వాగుపై నూతన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రతి రెండు గంటలకు జంపన్న వాగు వరద ఉధృతి పరిశీలిస్తున్నామని, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఆగస్టు 31 వరకు అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
జిల్లాలో 170 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్‌వో అప్పయ్య, ఓఎస్డీ మహేశ్ బాబా గీతే, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో మృతి చెందిన సమ్మక్క పూజారి మల్లెల ముత్తయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆలకుంట రమేశ్ కుటుంబాలను మంత్రి పరామర్శించారు. తాడ్వాయి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ కొత్త రవీందర్ అభిమానంతో ఆయన చేతులతో వేసిన మంత్రి సీతక్క చిత్రపటాన్ని ఆమెకు బహూకరించారు.
పుష్కరఘాట్ వద్ద ప్రమాద హెచ్చరిక
ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద నీటి మట్టం 14.830 మీటర్లు దాటడంతో అధికారులు సోమవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, రాత్రి ఏడు గంటలకు15.710 వరద ఉదృతి పెరిగింది. 17.360 మీటర్లకు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రామన్నగూడెం పుష్కరఘాట్‌ను ఐటీడీఏ పీవో చిత్రామిశ్రతో కలిసి సందర్శించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉందన్నారు.
మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం..
వాజేడు మండలం చీకుపల్లి బొగత జలపాతం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్వోలతో కలిసి ప్రారంభించిన అనంతరం వంటకాలను రుచి చూశారు. పర్యాటకులు సైతం మహిళా శక్తి క్యాంటీన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని ప్రారంభించారు.
ఆస్పత్రిలో రోగులతో మాట్లాడిన మంత్రి..
ఏటూరునాగారం సామాజిక వైద్యశాలను సందర్శించిన మంత్రి సీతక్క రోగులతో మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలను కలిసి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని గర్భిణులను ఆస్పత్రికి తరలించామని డీఎంహెచ్‌వో అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గర్భిణులకు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.