కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: ములుగు గట్టమ్మ సమీపంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమీకృత కలెక్టరేట్ పనులు డిసెంబర్ లోపు పూర్తిచేయాలని సూచించారు. కలెక్టరేట్ కు పోయే రోడ్డును వేగంగా నిర్మించాలన్నారు. నూతనంగా మెడికల్ కళాశాలలో కోర్స్ లు, విద్యార్థులు, సదుపాయాలు వంటి అంశాలను కళాశాల ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ లాల్, ఏరియా ఆస్పత్రి సూపరిండెంట్ జగదీశ్వర్, ఆర్అండ్ బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.