
ఏటూరునాగారం, వెలుగు :163వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌పై 2001లో మావోయిస్టులు రాకెంట్ లాంచర్లతో దాడి చేయడంతో భద్రతా చర్యల కారణంగా పోలీసులు అప్పట్లో ఈ హైవేను మూసివేశారు. ఇరువైపులా గేట్లు పెట్టి వాహనాలను పీవో గెస్ట్‌హౌస్ పక్క నుంచి మళ్లించారు. వాహనాల రద్దీ, ఇసుక లారీల రాకపోకలో పీవో బంగ్లా చుట్టూ ఉన్న రోడ్డు గుంతల మయంకావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
దీంతో స్థానికులు ఈ విషయాన్ని మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లడంతో పీఎస్ ముందు 163వ హైవే పై ఏర్పాటు చేసిన ఏట్లను ఎత్తివేయాలని ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్, పోలీస్ సిబ్బంది గేట్లను ఎత్తివేయడంతో రాకపోకలు కొనసాగుతున్నాయి. 25 ఏండ్ల తర్వాత హైవేపై ప్రయాణానికి మోక్షం లభించిందని ప్రజలు, వాహనదారులు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -