కొమురం భీం జిల్లా: ఆదివాసీలకు ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని కల్పించిన పోరాట యోధుడు కొమురం భీం అని.. ఆయన లేకపోతే ఇవాళ మనం ఉండకపోయేవాళ్లమని మంత్రి సీతక్క అన్నారు. కెరమెరి మండలం జోడేఘాట్లో కొమురం భీం 84వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతక్క మాట్లాడుతూ.. కొమురం భీం పోరాటంతోనే ఆదివాసీలకు హక్కులు సిద్ధించాయని కొనియాడారు. కొమురం భీం పోరాట స్ఫూర్తితో సాగిన పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు.
ఆదివాసీల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నారని సీతక్క తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లక్ష 60 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. పోడు భూముల విషయంలో అత్యుత్సాహం చూపించొద్దని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. ప్రజలపై దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కొమురం భీం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామన్న సీతక్క.. ఇక్కడ రోడ్లు, ఇండ్లు, హాస్టల్ల అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
ALSO READ | వట్టి వాగు ప్రాజెక్ట్ రక్షణకు చర్యలు చేపడతాం : మంత్రి సీతక్క
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నివేదిక రెడీ చేసి ఇవ్వాలని కలెక్టర్ మంత్రి సీతక్క ఆదేశించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జోడే ఘాట్ వస్తారని.. జోడేఘాట్ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో కుల గణన జరుగుతోందని.. అధికారులకు మీ సమాచారం ఇవ్వాలని.. సబ్ క్యాస్ట్ చెప్పుకోవాలని ఆదివాసీలకు సూచించారు. ఆడవాళ్ళ జోలికి వస్తే ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని.. మేం వెంటే ఉంటామని భరోసా కల్పించారు. ఇది మీ ప్రభుత్వం.. మీ మనుషులమని అన్నారు.