హైదరాబాద్: బతుకమ్మ పండగను తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా చేసుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి సీతక్క అన్నారు. సాంస్కృతిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్వేచ్ఛనిచ్చారని పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తోటి మహిళలతో కలిసి ఉత్సహంగా బతుకమ్మ వేడుకల్లో సీతక్క పార్టిసీపేట్ చేశారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు విదేశాల్లోనూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆత్మీయత, భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటున్న ప్రజలకు ఈ సందర్భంగా మంత్రి సీతక్క పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మలోని ప్రతి పువ్వుకు ఒక గుణం ఉంటుందన్న సీతక్క.. బతుకమ్మ పండగ వెనక భక్తితో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయన్నారు. గౌరమ్మను చేసే పసుపులో యాంటీబయోటిక్ ఉంటుందని.. చెరువుల్లో వేసే పూలతో నీరు శుద్ధి అవుతుందని తెలిపారు.
బతుకమ్మను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని.. భవిష్యత్ తరాలకు మన బతుకమ్మను అందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే వాగులు, వంకలు, గుట్టలు, చెరువులని అభవర్ణించిన సీతక్క.. చెరువుల మీద ఆధారపడి ఎంతో మంది రైతన్నలు వ్యవసాయం చేస్తున్నారని.. అలాంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని హితవు పలికారు. మహిళలకు తోడుగా ఉండాలని పురుష ప్రపంచానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మహిళలతో ఎలా ప్రవర్తించాలో తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుండే నేర్పించాలని సూచించారు.