మహిళా సాధికారతకు కేరాఫ్​ కాంగ్రెస్​ : మంత్రి సీతక్క

మహిళా సాధికారతకు కేరాఫ్​ కాంగ్రెస్​ : మంత్రి సీతక్క
  • ఐటీడీఏలను తెచ్చింది మా ప్రభుత్వమే
  • మహిళలకు రూ.2 లక్షల బీమా అమలు చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇందిరా గాంధీ నుంచి సోనియా గాంధీ వరకు కాంగ్రెస్​ పార్టీ మహిళా సాధికారితకు పాటుపడిన పార్టీ అని మంత్రి సీతక్క అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలిచింది కాంగ్రెస్సే అన్నారు. కాంగ్రెస్​ ఇచ్చిన రిజర్వేషన్లతోనే తన లాంటి ఆదివాసీలు సభలో ఉన్నారని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్​పై జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్​ ఇచ్చారు. నాడు మంత్రిగా ఉన్న భీంరావు హయాంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఐటీడీఏలను తీసుకొచ్చిందని గుర్తుచేశారు. దాని వల్ల మారుమూల తండాలకూ స్కూళ్లు వచ్చి లోకల్  పిల్లలు చదువుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.

కానీ, బీఆర్ఎస్​ సర్కారు ఆ స్కూళ్లను నిర్లక్ష్యం చేసిందని ఫైర్​ అయ్యారు. మహిళలు 17 రకాల వ్యాపారాలు చేసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మహిళలకు రూ.2 లక్షల బీమా అమలు చేయబోతున్నామన్నారు. ‘‘ఆసిఫాబాద్​, ఆదిలాబాద్​ జిల్లాలు నిజంగానే వెనుకబడ్డాయి. వాటిని అభివృద్ధి చేస్తాం. దండారీ జరిగినప్పుడు నిరుడు బీఆర్ఎస్​ ప్రభుత్వమే ఉంది. వాళ్లే నిధులు ఇవ్వలేదు. మేం తప్పకుండా నిధులిస్తాం. గత ప్రభుత్వం అంగన్ వాడీ టీచర్లు రిటైర్​ అయితే రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేలు ఇచ్చేది. మా ప్రభుత్వం దానిని రూ.2 లక్షలు, రూ.లక్షకు పెంచాలని నిర్ణయించింది’’ అని మంత్రి పేర్కొన్నారు. 

గత సర్కారు సీడీపీ నిధులివ్వలే

తాను ఎమ్మెల్యేగా ఉన్న గత ఐదేండ్లలో ఏనాడూ కేసీఆర్​ ప్రభుత్వం సీడీపీ నిధులు ఇవ్వలేదని సీతక్క ఆరోపించారు. కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఇస్తామన్నారు. తన తండ్రి గురించి బీఆర్ఎస్​ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే కాకముందు నుంచే తన తండ్రి పోడు చేశారన్నారు. తాను అడవిలో ఉన్నప్పుడే పోడు కొట్టారన్నారు.