ములుగు, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రైతును రాజు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఐటీడీఏ మీటింగ్హాల్లో శుక్రవారం మంత్రి సీతక్క వ్యవసాయ, వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు.
రైతులను బ్యాంకర్లు ఇబ్బందులు పెట్టొద్దన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో పని చేసే ప్రతి ఉద్యోగి పోటీతత్వంతో పని చేస్తూ ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకుపోవాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో ఫిష్ మార్కెట్ నుంచి వై జంక్షన్ వరకు సీఆర్ఆర్ రూ.75 లక్షలతో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్, రూ.30 లక్షలతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయం అదనపు గదుల భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎంహెచ్ వో అప్పయ్య, ఏరియా ఆస్పత్రి సూపర్ ఇండెంట్ జగదీశ్వర్, మెడికల్ ప్రిన్సిపాల్ మోహన్ లాల్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.