- రాష్ట్రంలో డాక్టర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సీతక్క
పద్మారావునగర్, వెలుగు: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని మంత్రి సీతక్క అన్నారు. స్త్రీలను దేవతలుగా చూసే మన దేశంలో ఇలాంటి దుశ్చర్యలకు స్థానం లేదన్నారు. గాంధీ ఆస్పత్రిలో తన నియోజకవర్గానికి చెందిన కొందరు పేషంట్లు చికిత్స పొందుతుండడంతో బుధవారం వారిని చూసేందుకు మంత్రి సీతక్క వచ్చారు.
అనంతరం అక్కడ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న శిబిరం వద్దకు వచ్చి వారికి సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోల్‌కతా ఘటన తనను దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు. ఇప్పుడిప్పుడే మహిళలు ఇండ్ల నుంచి బయటకు వచ్చి ఆయా రంగాల్లో రాణిస్తున్నారని, ఇలాంటి హేయమైన ఘటనలు తిరిగి మహిళలను మధ్య యుగాలకు తీసుకువెళ్తాయన్నారు.
తప్పు చేసిన నిందితులు ఎంతటి వారైనా ఊపేక్షించకూడదన్నారు. చట్టం ముందు అంతా సమానులేనని అన్నారు. రాష్ట్రంలోని డాక్టర్లకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, తరగతి గదుల నుంచే మహిళలను గౌరవించాలని పాఠ్యాంశాల్లో చేర్చుతామన్నారు. మహిళల రక్షణకు తీసుకునే భాద్యత విషయంలో ప్రభుత్వానితో పాటు ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళల భద్రతపై కఠినమైన చట్టాలను రూపొందించడానికి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతా ఘటనకు బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
ఓపీ, ఎలెక్టివ్ ఓటీ సేవలు బాయ్‌కట్..
కోల్ కతాలో పీజీ డాక్టర్ పై జరిగిన హత్యాచారం ఘటనను నిరసిస్తూ బుధవారం గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు అవుట్ పేషెంట్ విభాగం (ఓపీ) డ్యూటీలతో పాటు ఓటీ సేవలను బహిష్కరించారు. నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు తమ ఆందోళన ఆగదన్నారు. వీ వాంట్జస్టిస్.. డాక్టర్లపై దాడులు నశించాలి.. అంటూ పెద్దగా నినదించారు. అలాగే, ఆస్పత్రి, మెడికల్ కాలేజీ పరిసరాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.