అభివృద్ధిలో మానుకోట నెం.1 కావాలి : సీతక్క

అభివృద్ధిలో మానుకోట నెం.1 కావాలి : సీతక్క
  • ఆఫీసర్లు పబ్లిక్ సమస్యలకు టైమ్ కేటాయించాలి
  • మహిళా శక్తి క్యాంటీన్ల విస్తరణకు కృషి
  • మూడునెలలకోసారి ప్రగతిపై రివ్యూస్
  • పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాను డెవలప్మెంట్ లో రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని పంచాయతీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సీతక్క కోరారు. శనివారం మహబూబాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల కోడ్ మూలంగా కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆఫీసర్లు ప్రగతి పనులను పరిగెత్తించాలని కోరారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రగతిపై రివ్యూస్ ఉంటాయని తెలిపారు.

ప్రభుత్వ స్కీంల అమలుపై శ్రద్ధ వహించాలి 

 రాష్ర్ట ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న వివిధ స్కీంల అమలుపై ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సీతక్క అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని చెప్పారు. జిల్లాలో గిరిజన జనాభా అధికంగా ఉంటుందని, మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం ఆఫీసర్లు అందుబాటులో ఉండాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఉత్తమ విద్యను అందించే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు. పాఠశాలల్లో మత్తు పదార్థాలపై అవగాహన తరగతులు నిర్వహించాలన్నారు. 

జిల్లాలో గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో చుట్టూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని, రోజు వారీగా హాస్టళ్లను తనిఖీ చేయాలని, ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించి విద్యాబోధన, నాణ్యమైన భోజనం అందించాలని, సరకుల అక్రమ రవాణా జరుగకుండా కఠినంగా వ్యవహరించి అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

నకిలీ విత్తనాలపై దృష్టి సారించి జిల్లాలోని టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించాలని, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్ ఉన్న పనుల్లో కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కల్వర్టు నిర్మాణ పనులకు ఆటంకం కలుగకుండా ఫారెస్టు డిపార్ట్మెంట్ సమన్వయంతో పనుల పూర్తికి సహకరించాలని చెప్పారు. 

సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ స్కూల్స్​లో పరిశుభ్ర వాతావరణం, నాణ్యమైన ఆహారం పిల్లలకు అందించాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల ద్వారా మొక్కలు అందుబాటులో ఉంచుతూ, గ్రామానికి చివరలో పండ్ల మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా ఆర్థికాభివృద్ధికి మహిళా సంఘాలకు ప్రభుత్వం ద్వారా ఆమోదించిన యూనిట్లకు బెనిఫిషరీస్ గుర్తింపు త్వరగా జరగాలన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, నిరంతరం గస్తీ నిర్వహించాలని, గంజాయి కేంద్రాలను గుర్తించాలన్నారు. చిన్న పిల్లలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ తయారు చేసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని పోలీసు అధికారులకు సూచించారు.

మహిళా శక్తి క్యాంటీన్ల విస్తరణకు కృషి.. 

మహిళలు ఆర్థికంగా ఎదుగడానికి, వారు ఉత్పత్తి చేసిన వస్తువుల విక్రయాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముందుకొస్తుందన్నారు. జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు కృషి     చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని, జిల్లాలో మహిళా క్యాంటీన్లను ప్రారంభించడానికి అనువైన స్థలాలను గుర్తించాలని చెప్పారు. 

విద్యుత్ ప్రమాదాలను నివారించాలి..

జిల్లాలోని పలు మండలాల్లో ట్రాన్స్ కో అధికారులు వేలాడే విద్యుత్​తీగలను సరిచేసి, ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వ విప్, డోర్నకల్​ ఎమ్మెల్యే జాటోత్​ రాంచంద్రునాయక్​కోరారు. నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పంటలపై అవగాహన కల్పించాలని, భూసార పరీక్షలు చేయాలన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీం ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చూడాలని మంత్రిని కోరారు.

భూకబ్జాలపై దృష్టి పెట్టాలి

గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో అనేక చోట్ల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను కాపాడే విధంగా ఆఫీసర్లు పనిచేయాలని మహబూబాబాద్​ ఎమ్మెల్యే మురళీ నాయక్​ కోరారు.  సమావేశంలో ఇల్లంద ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎమ్మెల్సీ టి.రవీందర్ రావు, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు డేవిడ్, లెనిన్ వత్సల్ టొప్పో, డీఎఫ్వో బత్తిని విశాల్, వివిధ శాఖల ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. 

ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి 

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి జిల్లా ఆఫీసర్లు ప్రాధాన్యత ఇవ్వాలని మహబూబాబాద్​ ఎంపీ పోరిక బలరాం నాయక్​ కోరారు. తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, గవర్నమెంట్ దవాఖానకు వచ్చే రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, డాక్టర్లు పేషేంట్లకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అధికారులు స్కానింగ్ సెంటర్ల పై నిఘా పెట్టాలన్నారు.