కొత్తగూడ, వెలుగు: మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ర్ట పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఆమె మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మోకాళ్లపల్లిలో జరిగిన ఆదివాసీల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి బోనాల పండుగలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఎంచగూడం, సాధిరెడ్డిపల్లి, కోనాపురం, ఓటాయి, రాంపూర్, ఎదుళ్లపల్లి, గోవిందాపురం, పెగడపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఆమెవెంట ఎంపీపీ విజయరూప్సింగ్, జడ్పీటీసీ పుష్పలత, పార్టీ మండలాధ్యక్షుడు వజ్జ సారయ్య, లీడర్లు తదితరులు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ములుగు, వెలుగు: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. శుక్రవారం మంత్రి ఓ ప్రకటనలో మాట్లాడుతూ నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలను పరిశీలించి, ఏమైనా మరమ్మతులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
డీఎంఎఫ్ టీ నిధులు మంజూరు చేస్తామన్నారు. మంగపేట వద్ద కరకట్ట నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని, గోదావరి, జంపన్న వాగు ఉధృతితో గతేడాది అనేక గ్రామాలు మునిగాయని, అందుకు కారణాలను గుర్తించి, చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంకటాపూర్ మండలంలోని మారేడుగొండ చెరువు కట్ట నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.