ఆదిలాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిస్తే, ఆడబిడ్డలుగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి పథంలో నిలుపుతామని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో చేపట్టిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగం ద్వారా ఇవాళ స్వేచ్ఛగా మనం జీవించగలుగుతున్నామని, అదే రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని పాల్గొన్నారు.
జైనూర్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ గిరిజన రైతులను గత ప్రభుత్వం విస్మరించిందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా గురువారం జైనూర్, సిర్పూర్ యూ మండలాల్లోని పలు గ్రామాల్లో సీతక్క ప్రచారం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కనిపించడం లేదన్నారు. ఏ గ్రామానికి వెళ్లిన ఇందిరమ్మ ఇళ్లే కనిపిస్తునాయన్నారు. సాగు నీరు లేక రైతులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, జైనూర్, నార్నూర్ మండలాలకు సాగు నీరు అందించేందుకు లేండిగూడ మినీ ప్రాజెక్ట్ కట్టి తీరుతామని హామీచ్చారు.
ఎంపీ ఎన్నికల తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. పోడుసాగు రైతులకు న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారికి రైతు భరోసా కట్ చేస్తారని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాని ఎవ్వరూ నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్రం భాస్కర్, శ్యామ్ నాయక్, కూడేమెత విశ్వంత్, పెందోర్ గణపత్ రావు, జూగ్నక్ దేవురావు, కుమ్ర బుజంగ్ రావు, జైనూర్, సిర్పూర్ యూ మండల పార్టీ ప్రెసిడెంట్లు ముఖీద్, గోవింద్ రావు
ఉన్నారు.