ఏజెన్సీలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి : మంత్రి సీతక్క

ఏజెన్సీలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి : మంత్రి సీతక్క

ఆదిలాబాద్, వెలుగు: ఏజెన్సీలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఉట్నూర్​లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క అదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, వెంకటేశ్​ ధోత్రే, ఎస్పీలు గౌస్ ఆలం, డీవీ శ్రీనివాస రావు, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత రెండ్రోజులుగా ఆదివాసీలతో సుదీర్ఘమైన సమావేశాలు నిర్వహించామని, ఏజెన్సీలో జరుగుతున్న సంఘటనలపై శాంతియుత వాతవరణం ఉండేలా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోందన్నారు. 

ఆదివాసీ హక్కులు, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, చట్టపరంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో కలసి సంఘ నాయకులతో  సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు ఆదివాసీ సంఘాల నాయకులు వారి సమస్యలు, గిరిజన గ్రామాల్లో జరుగుతున్న సంఘటనలపై మంత్రికి వివరించారు. ఐటీడీఏలో నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు జరగడంలేదన్నారు.

గిరి పోషణ మిత్ర ద్వారా విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం

గిరి పోషణ మిత్ర ద్వారా గిరిజన విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ఉట్నూర్ గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గిరిజన పోషణ మిత్ర కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడ దొరికే ఆహార పదార్థాలతో తయారుచేసిన పోషకాహారాన్ని విద్యార్థులకు అందించి వారి సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేయాలని కోరారు. 

గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళ, శుక్రవారాలు మెడికల్ క్యాంపులు నిర్వహించి హెల్త్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలన్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, నేతలు, తదితరులు పాల్గొన్నారు.