కాంగ్రెస్​తోనే పేదల రాజ్యం : మంత్రి సీతక్క

  • రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తేనే అన్నివ‌ర్గాల స‌మ‌స్యలు ప‌రిష్కార‌ం
  • కుల‌మ‌తాలతో రాజ‌కీయం చేసే వారితో జాగ్రత్తగా ఉండాలి 
  •  ఆదివాసీ ఆడబిడ్డను పార్లమెంట్​కు పంపండి

ఆదిలాబాద్ టౌన్/ఇచ్చోడ, వెలుగు : పేద‌వ‌ర్గాల హ‌క్కులు కాపాడే రాజ్యం రావాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమ‌ని జిల్లా ఇన్​చార్జి మంత్రి సీత‌క్క అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆదిలాబాద్​లోని ర‌త్నా గార్డెన్​లో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్​చార్జి కంది శ్రీ‌నివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్లమెంట్ స్థాయి స‌న్నాహ‌క స‌మావేశానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ‌తో క‌లిసి చీఫ్ గెస్ట్​గా హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాలపై శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు.

రేవంత్‌ రెడ్డి నాయ‌క‌త్వంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేయ‌డ‌మే ల‌క్ష్యంగా అంద‌రూ ఏక‌తాటిపైకి వ‌చ్చి కాంగ్రెస్​అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని భావిభార‌త‌ ప్రధానిని చేస్తేనే అన్నివ‌ర్గాల స‌మ‌స్యలు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు. ప‌దేండ్లు పాలించిన బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి ఏంచేయ‌లేద‌నే ప్రజలు ఇంటికి పంపించార‌ని పేర్కొన్నారు. న‌ల్లధ‌నాన్ని వెలికితీసి ప్రతి నిరుపేద ఖాతాలో రూ.15 ల‌క్షలు జ‌మ చేస్తామ‌ని చెప్పి మోదీ మోసం చేశార‌ని మండిపడ్డారు.

ఈ దేశంలో పేద‌ల‌కు కాంగ్రెస్​అనేక హ‌క్కులు క‌ల్పించిందన్నారు. ప్రతిఒక్కరూ చ‌దువుకోవాల‌ని విద్యాహ‌క్కుతోపాటు ఆహార భ‌ద్రత చ‌ట్టాన్ని తీసుకొచ్చింద‌ని.. కానీ భ‌క్తి పేరుతో, భ‌గ‌వంతుడి పేరుతో రాజ‌కీయాలు చేస్తూ బీజేపీ ప‌బ్బం గ‌డుపుకుంటోంద‌ని ఫైర్ ​అయ్యారు. ఆదానీలు, అంబానీలకు పెద్దపీట వేస్తూ పేద‌ల సంక్షేమాన్ని విస్మరిస్తోంద‌ని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ హ‌యాంలో ఎంత మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వ‌చ్చాయో చెప్పాల‌న్నారు. అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చిన ఘ‌న‌త కాంగ్రెస్‌ దేన‌ని అన్నారు. కుల‌మ‌తాల మ‌ధ్యచిచ్చులు పెట్టి రాజ‌కీయం చేసే వారిని గ‌మ‌నించి జ‌నం అప్రమత్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

అనంతరం సాయంత్రం పట్టణంలోని పుతలిబౌలిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు సత్తు మల్లేశ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా అసెంబ్లీ ఇన్​చార్జీలు ఆడే గజేందర్, శ్యాం నాయక్, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ సెడ్మకి ఆనంద్ రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఎన్ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు శాంత‌న్‌రావు, యువ‌జ‌న కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు చ‌ర‌ణ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించండి

అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ఆదివాసీ ఆడబిడ్డను పార్లమెంట్​కు పంపించాలని మంత్రి  సీతక్క కోరారు. ఇచ్చోడలోని ఓ గార్డెన్స్​లో ఏర్పాటు చేసిన బోథ్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి అన్నదాతలందరినీ ఆదుకుంటామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని రకాల వసతులు కల్పించి విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.

బీఆర్​ఎస్​ పదేండ్లు పాలించినా బోథ్ నియోజకవర్గ వెనుకబాటుకు గురైందని, సంపాదనే ధ్యేయంగా పనిచేశారని ధ్వజమెత్తారు. అలాంటి వారిని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి ఉద్యమ నాయకురాలు, ఉపాధ్యాయురాలు ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్​లోకి పలువురు నాయకులు చేరగా మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.