తాడ్వాయి, వెలుగు : ఈసారి మేడారం మహా జాతరకు వీఐపీ, వీవీఐపీ పాస్‌లను తగ్గిస్తున్నామని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం మేడారంలోని హరిత హోటల్లో మంత్రి మాట్లాడుతూ జాతర పనులను రెండు నెలల ముందే మొదలుపెట్టి జాతరకు పది రోజుల ముందే పూర్తి చేశామన్నారు. ముందస్తు మొక్కులకు లక్షలాది మంది తరలివస్తుండడంతో కరెంటు సరఫరా కల్పించడంతో పాటు జంపన్న వాగు వద్ద బ్యాటరీ ట్యాపులు బిగించామన్నారు. సాధారణ భక్తులకు ఇబ్బందులు తగ్గించడానికి వీఐపీ, వీవీఐపీ పాసులను తగ్గించనున్నామని చెప్పారు. ఒక్క పాస్‌పై అయిదుగురికి మాత్రమే అవకాశం కల్పిస్తామన్నారు.
అంతకముందు హరిత గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్‌తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర పది రోజులే ఉన్నందున పెండింగులో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ మాట్లాడుతూ గద్దెల వద్ద డ్యూటీలు చేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జంపన్న వాగులో ప్రాణ నష్టం జరగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు. వైద్య సేవలు అందించేందుకు 40 అంబులెన్సులను సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లా అడిషనల్కలెక్టర్ పి శ్రీజ, ఏటూరునాగారం అడిషనల్ఎస్పీ సిరిశెట్టి సంకీర్తు, రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, దేవాదాయ శాఖ ఆఫీసర్రాజేంద్ర పాల్గొన్నారు.