- గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తా
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : ములుగు జిల్లాలోని రైతులకు రెండు పంటలకు సాగునీరు ఇచ్చేలా కృషి చేస్తానని మంత్రి సీతక్క చెప్పారు. దేశానికి గ్రామాలే పట్టు కొమ్మలని, వాటి అభివృద్ధికి పాటు పడుతానని హామీ ఇచ్చారు. ములుగు మండలం గుర్తూరు తండా, కాసిందేవిపేట, గోవిందరావు మండలం దుంపెల్లిగూడెంలో నిర్మించిన గ్రామ పంచాయతీ ఆఫీస్‌లను ఆదివారం అడిషనల్ కలెక్టర్ శ్రీజతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోని గ్రామాలకు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని, నిరుపేదలను రూ.5 లక్షల తో ఇండ్లు కట్టిస్తామన్నారు. ఇప్పటికే ఫ్రీ బస్, ఆరోగ్యశ్రీ గ్యారంటీలు అమలు చేశామని, మిగిలిన నాలుగు గ్యారంటీలను సైతం త్వరలోనే అమలు చేస్తామన్నారు. అంతకుముందు రాయినిగూడెంలో ఆమెను సన్మానించారు. ఆమె వెంట ఐటీడీఏ పీవో అంకిత్, జడ్పీ సీఈవో ప్రసూణరాణి, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, ఐటీడీఏ ఈఈ హేమలత, డీఎంహెచ్‌వో అప్పయ్య పాల్గొన్నారు.