పరీక్షలు వాయిదా పడితే తీరని నష్టం : మంత్రి సీతక్క

  •     నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు
  •     తొమ్మిదేండ్లు కొలువులు లేక గోస పడ్డరు
  •     ఉద్యోగ ఖాళీలతో ప్రజలకు సేవలు అందడం లేదు
  •     టీచర్లు లేక స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నరని వెల్లడి
  •     బీఆర్ఎస్​కు చిత్తశుద్ధి ఉంటే నియామకాలు ఎందుకు జరపలేదని ఫైర్

హైదరాబాద్, వెలుగు: పరీక్షలు వాయిదా వేస్తే నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క అన్నారు. గత పదేండ్లుగా ఉద్యోగ నియామకాలు లేక లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న నిరుద్యోగుల ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా మారుతుందని ఆదివారం ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏండ్లుగా కోచింగ్ తీసుకున్న వాళ్లు అన్ని విధాలా న‌ష్టపోయే ప్రమాదం ఉందని, వారికి మ‌రింత న‌ష్టం జ‌ర‌క్కుండా చూడాల్సిన‌ ‌ ‌బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.

వ‌మో ప‌రిమితి దాటిపోయి ఉద్యోగాల‌కు అనర్హులు అవుతారని, అందుకే వారి ఆకాంక్ష మేర‌కు షెడ్యుల్ ప్రకారమే ప‌రీక్షలు నిర్వహించాల‌ని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి గుర్తుచేశారు. వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉండడంతో ప్రజలకు సేవలు అందడం లేదని, టీచర్లు లేక సర్కారు స్కూళ్లలో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. అన్ని శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. 

ప్రజ‌ల‌కు స‌కాలంలో సేవ‌లందించాల‌న్న ప‌ట్టుద‌ల‌తోనే గ్రూప్ పరీక్షల నోటిఫికేష‌న్లతో పాటు డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చామని, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు త్వర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసి, ప్రతి ఏటా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. యూపీఎస్సీ త‌ర‌హాలో ఏటా షెడ్యూల్ ప్రకారం పోటీ ప‌రీక్షలు జ‌రుగుతాయని, ఇప్పుడు అవ‌కాశాలు దక్కని వారు జాబ్ క్యాలెండ‌ర్ ద్వారా విడుద‌ల‌య్యే నోటిఫికేష‌న్లను స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చని ఆమె సూచించారు. అలా కాకుండా త‌మ ప్రిప‌రేష‌న్ పూర్తయ్యే వ‌ర‌కు ప్రస్తుత ప‌రీక్షల‌ను వాయిదా వేయాల‌ని కొందరు కోరడం కరెక్టు కాదని అన్నారు. 

ఏడేండ్లుగా డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదు..?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అందుకే తమ సర్కారు నోటిఫికేషన్లు ఇస్తూ రిక్రూట్ మెంట్ చేపడుతున్నదని మంత్రి పేర్కొన్నారు. అధికారం కోల్పోయి రాజ‌కీయ నిరుద్యోగులుగా మారిన కొంద‌రు ప‌రీక్షలు వాయిదా వేయాల‌ని నిరుద్యోగుల‌ను రెచ్చగొట్టడం మానుకోవాలని మంత్రి సూచించారు. నిరుద్యోగులు కూడా ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని మంత్రి సూచించారు. నిరుద్యోగుల మీద అంత ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే గతంలో ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదని మంత్రి ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ తొమ్మిద‌న్నరేండ్ల పాల‌న‌లో ఒక్క గ్రూప్ వ‌న్ పరీక్ష నిర్వహించలేదని, ప్రతి ఏటా నిర్వహించాల్సిన డీఎస్సీ.. ఏడేండ్లుగా నిర్వహించలేదని విమర్శించారు. నోటిఫికేష‌న్లు, నియామ‌కాలు లేక వంద‌లాది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి గుర్తుచేశారు. రాజ‌కీయాల కోసం  నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి అవ‌కాశాల‌ను దెబ్బతీయొద్దని ఆమె సూచించారు.