మేడారం జాతర పనులు స్పీడప్‌‌ చేయండి : మంత్రి సీతక్క

తాడ్వాయి, వెలుగు : మేడారం జాతర పనులు స్పీడప్​ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. ములుగు నుంచి బయలుదేరిన మంత్రి ముందుగా గోవిందరావుపేట మండలంలోని పసర వద్ద ఉన్న గుండ్ల వాగు బ్రిడ్జిని, దయ్యాలవాగు సమీపంలోని రోడ్డును, మేడారం సమీపంలోని చింతల్ క్రాస్ రోడ్డును, జాతర పరిసర ప్రాంతాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. 

అక్కడి నుంచి మేడారం జంపన్న వాగు వద్ద ఉన్న జంట వంతెనలను, చిలకలగుట్టను, శివరాం సాగర్ చెరువు వద్ద ఉన్న వీఐపీ పార్కింగ్​ను, వై జంక్షన్ వద్ద ఉన్న బస్టాండ్​ను పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ములుగు ఎస్పీ గౌస్ అలాం, ఐటీడీఏ పీవో అంకిత్, లోకల్ బాడీస్ అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీజ, డీపీవో వెంకయ్య, డీఎస్పీ రవీందర్, ములుగు జిల్లా కాంగ్రెస్​అధ్యక్షుడు పైడాకుల అశోక్,  మహిళా అధ్యక్షురాలు,  కామారం సర్పంచ్ రేగ కళ్యాణి, తాడ్వాయి మండల అధ్యక్షుడు బొల్లుదేవేందర్, పీఏసీఎస్​చైర్మన్ పులి సంపత్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు అనంతరెడ్డి, ముజఫర్ ఖాన్ పాల్గొన్నారు.