అంగన్​వాడీ సిబ్బందికి రిటైర్మెంట్​ బెనిఫిట్స్​

అంగన్​వాడీ సిబ్బందికి రిటైర్మెంట్​ బెనిఫిట్స్​

ఏటూరునాగారం, వెలుగు: రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమని, దేశ భవిష్యత్తు అంగన్​వాడీ టీచర్లపై ఆధారపడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారం గిరిజన భవనంలో మహిళా అభివృద్ధి,  శిశు సంక్షేమ శాఖ, గ్రేస్  క్యాన్సర్  ఫౌండేషన్  హైదరాబాద్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంగన్​వాడీ టీచర్లు, ఆయాల ఉచిత  క్యాన్సర్  నిర్ధారణ శిబిరాన్ని కలెక్టర్  దివాకర టీఎస్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం అందిస్తూ వారి మెరుగైన జీవనానికి కృషి చేస్తున్న అంగన్​వాడీ టీచర్లు, ఆయాలకు సరైన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రిటైర్మెంట్, ఇతర ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్​వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని చెప్పారు. అంగన్​వాడీ టీచర్లు, ఆయాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రూ.30 వేల విలువైన పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్  మెంబర్  వలియాబీ సలీం, ఏటూరునాగారం సీడీపీవో హేమలత, ఈపీ ప్రేమలత, తాడ్వాయి సీడీపీవో మల్లీశ్వరి, గ్రేస్​ సంస్థ ప్రతినిధులు, డాక్టర్లు పాల్గొన్నారు.