- క్వాలిటీ విద్య అందించడంలో రాజీపడొద్దు
- ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు పురోగమించాలి
- మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
- మానకొండూరులో అమ్మ మాట–అంగన్‌వాడీ బాట
కరీంనగర్/మానకొండూరు, వెలుగు: ప్రీ ప్రైమరీ విద్యను బోధిస్తూ విజయం సాధిస్తున్న తెలంగాణ అంగన్వాడీ సెంటర్లు దేశంలోనే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ గర్ల్స్ హైస్కూల్ లో నిర్వహించిన పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమానికి బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం మంత్రులు మోడల్ అంగన్ వాడీ సెంటర్ సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. ఆహార పదార్థాల స్టాళ్లను సందర్శించి రుచి చూశారు. అలాగే గర్భిణులకు సీమంతం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మంచి ఆహారం, గాలి, నీరు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు.
రక్తహీనత కారణంగా గర్భిణులకు డెలివరీ సమయంలో కూడా రక్తం ఎక్కించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఒకప్పుడు మన పెరట్లోనే కూరగాయలు పండించుకునేవాళ్లమని, ఫెస్టిసైడ్స్ ఫుడ్స్ తగ్గించాలని సూచించారు. పల్లెలకు మళ్లీ పాత రోజులు రావాలని ఆకాంక్షించారు. గుడ్ల నాణ్యత లేకపోతే వారి కాంట్రాక్టులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పోషణ ఆరోగ్య జాతర కరీంనగర్ జిల్లా మానకొండూరు లో ప్రారంభించుకున్నామని, గర్భిణిగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. పోషకాహారంతో బలమైన బిడ్డలను రాష్ట్రానికి అందించాలనే తపనతో మంత్రి సీతక్క ఈ కార్యక్రమం తీసుకున్నారన్నారు. అనంతరం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో స్త్రీశిశు సంక్షేమ శాఖపై
రివ్యూ నిర్వహించారు.
ట్రస్ట్ సేవలు అభినందనీయం
మానకొండూర్, వెలుగు:మానసిక దివ్యాంగుల పాఠశాల నిర్వహిస్తున్న స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ సేవలు అభినందనీయమని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ది కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్– మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల, వృత్తి విద్యా శిక్షణా కేంద్రం 35వ వార్షికోత్సవ వేడుకలకు వారు గెస్ట్‌లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల, వృత్తి విద్యా శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ చాడ వెంకటరెడ్డి ట్రస్ట్‌ల పేరిట నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
సీతక్క మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగడం ప్రశంసనీయమన్నారు. మానసిక వికలాంగుల స్కూల్‌కు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ట్రస్ట్ చైర్మన్ సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ , డైరెక్టర్ క్రాంతి వెస్లీ, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ , మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.