మరోసారి గొప్ప మనసు చాటుకున్న మంత్రి సీతక్క

ఆపదలో ఉన్నామంటే నేనున్నాంటూ ఆదుకునే మంత్రి సీతక్క మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. ఇటీవల ప్రకతి భీభత్సానికి అతలాకుతులమైన కేరళ రాష్ట్రంలోని వయనాడ్ బాధితులకు ఆమె ఆర్థిక సహయం చేశారు. వయనాడ్ జిల్లాలో శనివారం మంత్రి సీతక్క పర్యటించారు. ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‎తో కలిసి ఆమె ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ప్రకృతి ప్రకోపానికి గురైన వయనాడ్ బాధిత కుటుంబాలను ఆదుకోవడం కోసం ఆమె సేకరించిన రూ.20 లక్షల చెక్‎ను స్థానిక ఎమ్మెల్యే టి సిద్దికికి అందించారు. చెక్‎తో పాటు దుస్తులు, నిత్యావసర వస్తువులను బాధితులకు అందజేశారు.

కొండచరియల కింద పడి గుర్తు పట్టలేనంతగా మారిపోయిన వందల మృతదేహాలను సాముహిక ఖననం చేసిన ముండక్కై స్మశాన వాటికలో మృతులకు సీతక్క శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కొందరు మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. కాగా, ఇటీవల వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రకృతి విలయతాండవం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తగా.. కొండ చరియలు విరిగిపడి కొన్ని గ్రామాలకు గ్రామాలే నేలమట్టం అయ్యాయి. ఈ విషాద ఘటనలో దాదాపు 400 మందికి పైగా మృతి చెందగా.. వెయి మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రకృతి భీభత్సం వల్ల కొన్ని వందల కుటుంబాల గూళ్లు చెదిరిపోయాయి. 

ALSO READ | ఇప్పటికే క్షమాపణ చెప్పా.. కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది: కేటీఆర్..