ప్రజాపాలనతోనే రాష్ట్రాభివృద్ధి : మంత్రి సీతక్క

ప్రజాపాలనతోనే  రాష్ట్రాభివృద్ధి : మంత్రి సీతక్క
  • సెప్టెంబర్​ 17న నిజాం రజాకార్ల నుంచి విముక్తి పొందిన తెలంగాణ

ములుగు/ వెంకటాపురం/ తాడ్వాయి, వెలుగు: ప్రజాపాలనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ములుగు కలెక్టరేట్ లో కలెక్టర్ దివాకర టీఎస్​, ఎస్పీ శబరీశ్​తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. 

జిల్లాలోని ఉత్తమ అధికారులను సన్మానించడంతోపాటు 57 మహిళా సంఘాలకు రూ.కోట్ల రుణాలు జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో 75 ఏండ్లకు తెలంగాణ విమోచనం దినోత్సవాన్ని ప్రజాపాలన దినంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అమరులందరికీ నివాళులర్పించుకుందామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  

స్వచ్ఛతతో దేశ ప్రగతి సాధ్యం.. 

స్వచ్ఛతతోనే దేశ ప్రగతి సాధ్యమని, అందుకుగాను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి ములుగులోని గ్రామపంచాయతీ, మార్కెట్​ ఏరియా తదితర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్​ కార్యక్రమం నిర్వహించారు. పోస్టర్​ ఆవిష్కరించి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. అనంతరం ములుగులోని డీఎల్​ఆర్ ఫంక్షన్ హాల్ లో ట్రస్మా ములుగు జిల్లా అధ్యక్షుడు పోశాల వీరమల్లు అధ్యక్షతన జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో బోధిస్తున్న 33మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సరోత్తం రెడ్డి, అడిషనల్​కలెక్టర్ మహేందర్ జీ, సంపత్ రావు, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, డీపీవో దేవరాజ్, డీఎస్పీ రవీందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా అధికారులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. అంతకుముందు ఆదివాసీల పండుగ అయిన కొత్తల (పెద్దల) పండుగకు స్థానిక సెలవు ప్రకటించాలని ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయీస్ ఫెడరేషన్ ములుగు జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ అల్లెం అప్పయ్య, అధ్యక్షుడు మంకిడి రవి, రాష్ట్ర కార్యదర్శి అన్నవరం రవికాంత్, ఉద్యోగులు మంత్రి సీతక్కను కోరారు.

కాలేజ్​భవన సముదాయం ప్రారంభం..

ములుగు జిల్లా వెంకటాపూర్​మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ఇంటర్మీడియట్ కాలేజ్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాజేడు మండలం పెనుగోలు గుట్టలపై నివాసముంటున్న గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే వాళ్లతో చర్చలు జరిపి మైదాన ప్రాంతంలోకి తీసుకొస్తామన్నారు. అనంతరం స్థానిక సీహెచ్ సీ ఆస్పత్రిని పరిశీలించి, డాక్టర్స్, సిబ్బందిని సన్మానించారు. వెంకటాపురం సీఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై కొప్పుల తిరుపతి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ నాయకులు చిడెం మోహన్ రావు, సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, మంత్రి కాన్వాయ్​ని మండల పరిధిలోని ఆరుగుంటలపల్లి వద్ద గిరిజనులు అడ్డుకుని బర్లగూడెం పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలకు సాగునీరు అందడం లేదని, పాలెం వాగు ప్రాజెక్టు నిర్మాణం జరిగి కూడా ఏండ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని వివరించారు. త్వరలో సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. తాడ్వాయి మండలంలో కురిసిన వర్షాలకు ప్రజలకు ఎలాంటి నష్టం జరుగకుండా, వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకున్న మండల స్పెషల్ ఆఫీసర్, డీఎంహెచ్​వో అలెం అప్పయ్య, తహసీల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో సుమనవాణి, ఎంపీవో  శ్రీధర్, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఇరిగేషన్ ఆఫీసర్ అరవింద్, అధికారులను మంత్రి సీతక్క సన్మానించారు.