రైతుల గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదు: మంత్రి సీతక్క

రైతుల గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదు: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: నల్ల చట్టాలతో రైతులకు నరకం చూపించిన చరిత్ర ప్రధాని మోదీదని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఢిల్లీ నడి వీధుల్లో 700 మంది రైతుల మృతికి ప్రధాని మోదీ కారణం కాదా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర సభలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను శనివారం ఒక ప్రకటనలో మంత్రి సీతక్క ఖండించారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు. పదేండ్ల పాలనలో రైతులకు పైసా రుణమాఫీ చేయని మోదీ.. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో మోదీ నంబర్ వన్ అని, 60 ఏండ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇస్తామని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఇప్పటికీ వాటి ఊసే లేదని మండిపడ్డారు. కిసాన్ సమ్మాన్ నిధి పెంచుతామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. సెస్‌‌ల పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రైతులపై పంట ఖర్చుల భారాన్ని మోపారన్నారు. ప్రధాని పంటల బీమా పథకంలో తన వాటా నిధులను తగ్గించారని, ఎరువులు, పెస్టిసైడ్స్‌‌పై సబ్సిడీ తగ్గించి, ధరలు పెంచింది మోదీ ప్రభుత్వమేనని విమర్శించారు.

ఏకకాలంలో 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ..

మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వంపై మోదీ విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. ఏకకాలంలో 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదన్నారు. టెక్నికల్‌‌ సమస్యలతో రుణమాఫీ కాని రైతులకు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల కోసమే బీఆర్‌‌‌‌ఎస్‌‌, బీజేపీ కాంగ్రెస్‌‌ను టార్గెట్ చేసి ధర్నాలు, విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

8 విడతల్లో అరకొరగా రుణమాఫీ చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌‌ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్‌‌ చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని, పేదల నివాస గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కేంద్రం మాటను నిలబెట్టుకోవాలని సూచించారు.