
హైదరాబాద్: రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్దేనని.. సింగిల్‌గానే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీ కార్యకర్తలను ఊహాలోకంలోనే ఉంచండి.. మీరు ఫామ్‌హౌజ్‌లోనే ఉండండని సెటైర్ వేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని మీరు ఎప్పటికీ అవే కలలు కంటూ ఉండండి.. మేం మాత్రం ప్రజలకు మంచి పాలన అందించి మళ్లీ అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు. ఇక మీరు ఎప్పటికీ అధికారంలోకి రారని సీతక్క అన్నారు.
కాగా.. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్దేనని.. సింగిల్‌గానే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో శనివారం రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ అన్నారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయి.. అలానే సిరిసంపదలు ఉన్న తెలంగాణాని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవని.. ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందని విమర్శించారు.
ALSO READ | నెక్ట్స్ పవర్ మనదే.. ఒక్కో కార్యకర్త ఒక్కో కేసీఆర్ కావాలి: KCR
ఆనాడు ప్రధాని మోడీ నా మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మేనిఫెస్టోలో పెట్టకున్న రైతు బంధు, కల్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దని అన్నారు. అందరూ ఒక్కో కేసీఆర్‌లా తయారు కావాలని.. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.