మట్టి రోడ్లు లేని సిటీగా కరీంనగర్ : మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: మట్టి రోడ్లు లేని సిటీగా కరీంనగర్ ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఆదివారం కరీంనగర్‌‌లోని తన క్యాంపు ఆఫీసులో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలో సీఎం హామీ నిధులు రూ.132 కోట్లు, కరీంనగర్ రూరల్ లో రూ.25 కోట్లతో పనులకు టెండర్లు పిలిచామని, ఆగస్టు 15 నుంచి పనులు ప్రారంభమవుతాయన్నారు. పార్టీలకతీతంగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, శివారు కాలనీల్లోని లింకు రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వీటితోపాటు ఇంకో మూడు, నాలుగు ఐలాండ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆగస్టు చివరి వరకు ఫస్ట్ ఫేజ్​ప్రారంభిస్తామని తెలిపారు. 

తాను ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడుతానని, ఎన్నికల తర్వాత దృష్టంతా అభివృద్ధిపైనే ఉంటుందన్నారు. అరకొర జీతాలతో జీవితాలు వెల్లదీస్తున్న జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల తనపై చేసిన కామెంట్లపై స్పందిస్తూ.. బీసీల నోరు ఆయన కంటే చాలా పెద్దదని, రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్ లో బీసీ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ఆయనకు సమాధానం చెప్తామన్నారు. లైబ్రరీ సంస్థ చైర్మన్ అనిల్ గౌడ్, కార్పొరేటర్లు శ్రీనివాస్, భూమా గౌడ్, ఐలేందర్ యాదవ్, యూత్ అధ్యక్షుడు కుల్దీప్ వర్మ, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ALSO READ :ఇరాన్ లో మళ్ళీ హిజాబ్ డ్రెస్ కోడ్ .. వీధుల్లోకి ప్రత్యేక పోలీస్ విభాగం

పెరిక సంఘ భవనానికి స్థలం కేటాయిస్తాం

పెరిక కుల సంఘ భవనానికి త్వరలో స్థలం కేటాయిస్తానని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. కరీంనగర్ విద్యానగర్ లో నిర్వహించిన పెరిక కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెప్సీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ కోకాపేటలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం ఏక సంఘంగా ముందుకు రావాలని కులపెద్దలకు విజ్ఞప్తి చేశారు. కుల సంఘం లీడర్లు ప్రభాకర వర్మ, ప్రభాకర్ , శ్రీరాం భద్రయ్య, సురేందర్, పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్: రాంనగర్ లోని ఎంఆర్ మున్నూరుకాపు సంఘం ఆద్వర్యంలో బోనాల ఉత్సవాల్లో  మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, బీఆర్​ఎస్​ సిటీ ప్రెసిడెంట్​ హరిశంకర్​ పాల్గొన్నారు.