గుడ్ న్యూస్: బ్యాకింగ్, ఫైనాన్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు: శ్రీధర్ బాబు

గుడ్ న్యూస్: బ్యాకింగ్, ఫైనాన్స్ రంగాల్లో  5 లక్షల ఉద్యోగాలు: శ్రీధర్ బాబు

రానున్న కొన్ని ఏండ్లలోనే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్ రంగాల్లో ఐదు లక్షల మంది ఉద్యోగుల అవసరం ఉంటుందని మంత్రి  శ్రీధర్ బాబు అన్నారు. ఈ ఖాళీల భర్తీకి నైపుణ్యం కలిగిన వారిని తయారు చేయగలిగితే రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. బీఎఫ్ఎస్​ఐ శిక్షణ తర్వాత కనీసం రూ.25వేల వేతనంతో ఉద్యోగులు లభిస్తాయన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఏనాడు నిరుద్యోగ యువత ఆకాంక్షలను గుర్తించలేకపోయిందని అన్నారు.

కానీ ప్రస్తుతం విద్యార్థులు, యువతకు ఉపాధి కల్పించడంపైనే తమ సర్కారు దృష్టి సారించిందని తెలిపారు. డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల ఫైనల్ ఇయర్ లో ఆరునెలల పాటు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించడానికి పలు బ్యాంకింగ్, ఫైనాన్స్ , ఇన్సురెన్సు సంస్థలు సంసిద్ధత తెలిపాయని వెల్లడించారు. కాగా, ఎక్విప్ సంస్థ రూ.2.5 కోట్ల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందించింది.

విద్యార్థుల డేటాతో రూపొందించిన ఎక్విప్ స్కిల్ పోర్టల్ ను సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే  మాజీద్ హుస్సేన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,  విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన పాల్గొన్నారు.