
- హైస్కూల్ స్థాయిలో వినియోగించేలా కెపాసిటీ పెంచాలి
- సర్కార్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచే ప్రయత్నం జరగట్లేదు
- ఫిన్లాండ్, ఫ్రాన్స్, బ్రిటన్ తరహా విద్యా వ్యవస్థపై స్టడీ చేయాలని మంత్రి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రాథమిక దశ నుంచే స్టూడెంట్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై అవగాహన కల్పించాలని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైస్కూల్ స్థాయిలో ఏఐని వినియోగించే కెపాసిటీ పెరిగేలా చూడాలన్నారు. ఈ విషయంలో కన్సల్టెంట్ల సేవలను తీసుకోవాలని తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్లో విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితా రాణా, ఇతర ఉన్నతాధికారులతో విద్యాసంస్కరణలపై ఆయన సమీక్ష చేశారు.
సర్కార్ చదువుల ప్రమాణాలు పెంచే ప్రయత్నం మాత్రం జరగట్లేదన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో వక్తృత్వ పోటీలు ఉండేవని, పిక్నిక్లు, ఎక్స్కర్షన్లకు తీసుకెళ్లేవారని గుర్తుచేశారు. ప్రైవేటు స్కూళ్లలో ఇవి జరుగుతున్నా ప్రభుత్వ స్కూళ్లలో లేవన్నారు. వచ్చేతరం పిల్లలకు ప్రపంచస్థాయి విద్యను అందించగలిగితేనే వాళ్లు పోటీ ప్రపంచంలో మనగలుగుతారన్నారు. విద్యపై ఎంతో ఖర్చు పెడుతున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదన్నారు. ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడలేకపోవడానికి గల కారణాలపై స్టడీ చేసి వాటిని మార్చాలన్నారు.
సిలబస్ మార్చాలి
స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీధర్ బాబు చెప్పారు. ‘‘గుజరాత్ నుంచి ఏటా 30 నుంచి 40 మంది గవర్నమెంట్ టీచర్లు సింగపూర్ వెళ్లి శిక్షణ పొందుతున్నారు. ఆ ప్రయత్నం మన దగ్గర కూడా జరగాలి. ఫిన్లాండ్, ఫ్రాన్స్, బ్రిటన్లలోని విద్యాప్రమాణాలపై స్టడీ చేసి.. ఆ స్థాయి విద్యను ప్రవేశపెట్టాలి. పాఠాలను పూర్తిగా మార్చాలి. మన టీచర్లను కూడా ఇతర దేశాలకు పంపించి స్కిల్స్ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
దానికి సంబంధించిన విధివిధానాలు సిద్ధం చేయండి. వచ్చే రెండు.. మూడేండ్లలో మన విద్యావిధానంలో సమూల మార్పులు జరగాలి. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించి అందులో మెరుగైన విధానాలను అమలు చేసే విషయం పరిశీలించండి’’ అని శ్రీధర్ బాబు సూచించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి, అదనపు డైరెక్టర్ లింగయ్య, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.